Flood Water Dangerous To Health : వరద నీరు ప్రజారోగ్యానికి సవాళ్లు విసురుతోంది. అసాధారణ రీతిలో తొమ్మిది రోజుల నుంచి నిల్వ ఉన్న బురద నీటివల్ల సంక్రమిత వ్యాధులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పారుదల జరగకుండా ఉన్న నీటి ద్వారా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ సంబంధిత వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. వీటిని నియంత్రించే చర్యల్లో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బృందాలు ఇప్పటికే ఇంటింటి సర్వేను చేపట్టి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నాయి. వర్షాలకు తగ్గట్లు వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీనికి తగ్గట్లు వరదనీటిలో జనవాసాలు ఇరుక్కోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఇంటింటా సర్వే చేపట్టిన 150 బృందాలు : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కేంద్రానికి రాసిన లేఖకు అనుగుణంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆరుగురు వైద్య నిపుణులతో కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో మంగళగిరి ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ సత్యనారాయణన్, రాజేంద్రప్రసాద్ రామకృష్ణ పాయ్ కూడా సభ్యులుగా ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు చెందిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లతో ఏర్పాటుచేసిన 150 బృందాలు ఇప్పటికే ఇంటింటా ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నాయి.అలాగే నిల్వ ఉన్న నీటివల్ల చర్మంపై దద్దుర్లు, ఇతర చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ఇదే నీరు శరీరంలోనికి చేరితే వ్యక్తికి లెప్టోస్పైరోసిస్ సంక్రమించే అవకాశం ఉంటుందన్నారు. ఇది ప్రాణాంతక వ్యాధి. నీటిలో ఎక్కువగా తిరగడం ద్వారా పాదాలు నానే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈ రకమైన వ్యాధులు సంక్రమించవచ్చు : కలుషిత నీటి ద్వారా విరేచనాలు, గ్యాస్ట్రో ఎంటరైటిస్, కామెర్లు, టైఫాయిడ్ దోమల ద్వారా మలేరియా, డెంగీ, గన్యా, మెదడు వాపు గాలి ద్వారా సాధారణ జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, స్వైన్‌ఫ్లూ, న్యుమోనియా, క్షయ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలుపుతున్నారు. కలరా కేసులు కూడా బయటపడే అవకాశం ఉందని వెల్లడించారు. గోడలు తేమగా ఉన్నందువల్ల ఫంగస్ సంబంధిత అనారోగ్య (శ్వాసపరమైన) సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. దోమలు, ఈగలవల్ల వచ్చే వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సులువుగా వైరస్ వ్యాప్తి చెందుతుందని వివరించారు. ఒళ్లునొప్పులు, కడుపులో తిప్పడంవంటివి కూడా ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
"వర్షాల సమయంలో కొందరికి బ్యాక్టీరియాతో వచ్చే న్యూమోనియా కూడా ఎక్కువవుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్థమా, ఊబకాయులకు ముప్పు ఎక్కువగా ఉంటుంది. టైఫాయిడ్ జ్వరం విడవకుండా వేధిస్తుంది. వాంతులు, విరేచనాలు, ఆకలి తగ్గడం, కడుపు నొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం కూడా రావొచ్చు. కాచి చల్లార్చి, వడపోసిన నీటిని తాగితే మంచిది. అప్పుడే వండిన ఆహారం తీసుకోవాలి. భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి. నీటి గుంతలు, మురుగునీరు ఉంటే వాటిపై ఒక చుక్క కిరోసిన్ లేదా నూనె లాంటివి వేయాలి. దీనివల్ల దోమల వృద్ధి తగ్గుతుంది." - తేజస్విని, వైద్యురాలు
"వాడుకోవాలనుకున్న మంచినీటిలో ధూళి కణాలుఉన్నట్లు కనిపిస్తే శుభ్రమైన వస్త్రంతో ఒక పాత్రలోనికి వడపోసుకోవాలి. లేదంటే పాత్రలోనికి నేరుగా తీసుకున్న నీటిలో ధూళికణాలు అడుగుభాగంలో పేరుకుపోయే వరకు వేచి ఉండాలి. ఆ తరువాత పై భాగంలో ఉన్న శుభ్రమైన నీటిని మరో పాత్రలోనికి మార్చుకోవాలి. ఈ నీటిని రెండు, మూడు నిమిషాలపాటు మరగించి చల్లార్చాలి. ఆ తరువాత మరో శుభ్రమైన పాత్రలో నిల్వ చేయాలి సురక్షితమైన నీటిని ఉంచే పాత్రలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. రసాయనాలకు ఉపయోగించిన ప్లాస్టిక్ కంటైనర్లను వాడకూడదు. నీటిని మరగించటం వీలుకాకుంటే సురక్షిత నీటి తయారీకి క్లోరిన్ టాబ్లెట్స్ లేదా బ్లీచింగ్ పౌడరు వాడాలి. క్లోరిన్ టాబ్లెట్స్‌ను నేరుగా నీటి వనరుకు కలపవచ్చు." - శ్రీకాంత్, వైద్యుడు