Five Youths Raped Two Girls in Jangaon : ఆడవాళ్లు ఒంటరిగా కనిపిస్తే చాలు కొందరు మగాళ్లు మృగాళ్లలా మారిపోతారు. ఆఖరికి తెలిసిన వ్యక్తులు కూడా వారిని వదిలిపెట్టడం లేదు. పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, పోక్సో చట్టం కింద వారిపై కేసు నమోదు చేశారు.
సైదాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో బాలికల కోసం ఓ ప్రైవేటు సంస్థ పునరావాస కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఈ పునరావాస కేంద్రంలో జనగామ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (14) మూడు నెలల నుంచి ఇక్కడే ఉంటుంది. అలాగే మల్కాజిగిరికి చెందిన మరో బాలిక (15) సెప్టెంబరు 18 నుంచి ఆశ్రయం పొందుతున్నారు. వీరిద్దరికీ తల్లిదండ్రులు ఉన్నా, వేర్వేరు కారణాలతో వారిని అక్కడ చేర్పించారు. ఇద్దరు బాలికలు ఒకే దగ్గర ఉండటంతో వారి మధ్య స్నేహం పెరిగింది.
దీంతో వారిరువురు అక్కడి నుంచి పారిపోవాలని పథకం రచించారు. సెప్టెంబరు 24న ఆశ్రయం కిటికీ నుంచి దూకి పారిపోయారు. ఇది గమనించిన నిర్వాహకులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇద్దరు బాలికలు రాత్రి 8 గంటల సమయంలో జనగామ చేరుకున్నారు. బాలికల్లో ఒక బాలిక బస్టాండ్ సమీపాన ఉన్న పాన్‌షాప్ నిర్వాహకుడు సాయిదీప్ దగ్గర ఫోన్ తీసుకుని తనకు పరిచయస్థుడైన నాగరాజుకు ఫోన్ చేసింది. అతడు వచ్చి తనను ఆశ్రయం కల్పిస్తానని చెప్పి, అక్కడి నుంచి తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన తర్వాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ తీసుకెళ్తామని చెప్పి : దీంతో బస్టాండ్ దగ్గర మరో బాలిక ఒంటరిగా ఉండిపోయింది. దీన్ని గమనించిన సాయిదీప్ ఆశ్రయం కల్పిస్తానని చెప్పాడు. దీంతో ఆ యువకుడి మాటలు నమ్మిన బాలిక అతనితో వెళ్లింది. పక్కనే ఉన్న బేకరీకి తీసుకెళ్లాడు. అక్కడ సాయిదీప్, బేకరీ నిర్వాహకుడు రాజు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే మొదటి బాలికను తీసుకెళ్లిన నాగరాజు ఆమెను సెప్టెంబరు 25న ఉదయం తీసుకొచ్చి బస్టాండ్ దగ్గర వదిలేశాడు. ఆ బాలికల విషయం తెలుసుకున్న సాయిదీప్, రాజుల స్నేహితులు అఖిల్, రోహిత్‌లు హైదరాబాద్ తీసుకెళ్తామని నమ్మించారు. ఈ క్రమంలో కారులో ఎక్కించుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో తిప్పుతూ వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తిరిగి బస్టాండ్ దగ్గరే వదిలిపెట్టి వెళ్లిపోయారు.
ఈ క్రమంలో ఆ ఇద్దరి బాలికలు పోలీసులకు కనిపించారు. అదే రోజు సైదాబాద్‌కు తీసుకొచ్చి పునరావాస కేంద్రంలో అప్పగించేశారు. నిర్వాహకులు భరోసా కేంద్రం నిపుణులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించారు. దీంతో బాలికలు తమపై లైంగిక దాడి జరిగిందని చెప్పారు. వెంటనే పునరావాస కేంద్రం నిర్వాహకులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఐదుగురు యువకులపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.