Fish Thorn must in Ponduru Khadi Sarees : మండుటెండల్లో పొందూరు చీర ఏసీలా చల్లగా పలకరిస్తుంది. ఎముకలు కొరికే గడ్డు శీతకాలంలో నులివెచ్చగా, హాయిగా చుట్టుకుంటుంది. ఇది ఒక్కటేనా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ పొందూరు నేత రచ్చ గెలిచిన తరవాతే ఇంట గెలిచింది. అదెలా అంటారా? స్వదేశీ ఉద్యమ కాలంలో పొందూరు ఖద్దరు గొప్పతనం గురించి గాంధీజీ తెలుసుకున్నారు. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి స్వయంగా తన కొడుకు దేవదాస్ గాంధీని పొందూరుకు పంపించారు. ఇక్కడి వస్త్రాల తయారీ, నాణ్యతను చూసి దేవదాస్ ఎంతో ముచ్చటపడ్డారు. దేవదాస్ గాంధీ చెప్పిన వివరాలతో గాంధీజీ తన 'యంగ్ ఇండియా' పత్రికలో పొందూరు ఖద్దరు గురించి అద్భతమైన వ్యాసం రాశారు. అది చదివిన అనేక మంది నాయకులు, ఉద్యమకారులు పొందూరు గ్రామానికి క్యూ కట్టారు. అలా మొదలైంది పొందూరు వైభవం.
ఆచార్య వినోభాబావే 1955లో శంకుస్థాపన చేసిన పొందూరు చేనేత సంఘ భవనము ప్రస్తుతం ఆంధ్రా ఫైన్‌ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘంగా మారింది. దీని పరిధిలో దాదాపు 26 గ్రామాల ప్రజలు జీవనం సాగిస్తున్నారు. వీరిలో 200 మంది నేత కార్మికులు, 1500 మంది నూలు వడికేవారు పని చేస్తున్నారు. వీరిలో అధిక సంఖ్యలో మహిళలే ఉన్నారు. ఈ గ్రామాల్లో ఏ ఇంటికి వెళ్లినా సున్నితమైన చేతులతో పత్తిని శుద్ధి చేసి వడుకుతోన్న స్త్రీలే ఎక్కువగా కనిపిస్తారు.
Banarasi Saree New Collection : మార్కెట్లో నయా 'బనారసీ' చీరలు.. డిజైన్లు అదుర్స్.. మహిళలు ఫిదా!
పొందూరు నేతలో మొదట చేసే పని చేప ముల్లుతో పత్తిని శుద్ధి చేయడం. చేప ముల్లుతో శుద్ది చేయడం ఏంటి అనుకుంటున్నారా! కానీ ఇది నిజమే. వాలుగ చేప దవడని ఇందుకోసం ఉపయోగిస్తారు. చేప ముల్లూ ప్రధాన పరికరం. రాజమహేంద్రవరం పరిసరాల్లో మాత్రమే దొరికే ఈ చేపముల్లుని మత్య్సకారులు మా కోసం ప్రేమగా ఇస్తారు. వీటిని మేం స్థానికంగా, ఒక్కోటి రూ.20లకు కొంటాం. చేప ముల్లుతో దూదిని ఏకడం వల్ల పత్తిలోని మలినాలు పోయి, వస్త్రం దృఢంగా ఉంటుందని పొందూరు గ్రామానికి చెందిన కోరుకొండ సరోజిని వెల్లడించారు.
అక్కినేని మనసు దోచి : తెల్లని దుస్తులు ధరించాలనుకునే చాలా మంది నిరాశ పడే విషయం అందరికి తెలిసిందే. ఒక్క ఉతుకు తరవాత అవి మెరుపు పోవడం, నల్లగా మారతూ ఉంటాయి. కానీ ఈ పొందూరు చీరలు, పంచెలు ఉతికే కొద్దీ ఇంకా ఇంకా వన్నెలీనుతాయి. అది మా గొప్పతనం కాదు, చేనేతది అంటారు శ్రీకాకుళం మహిళలు. వేసవిలో చల్లగా, తెల్లగా ఉండే ఈ పంచెల్ని అక్కినేని, సి.నారాయణ రెడ్డి వంటివారు ఎంతగానో ప్రేమించారు. వారు పొందురు నేతకు బ్రాండ్ అంబాసిడర్లుగానూ మారారు. ఇప్పటికీ ‘అక్కినేని అంచు పంచెలు’ ఇక్కడ బాగా అమ్ముడవుతాయని మహిళలు పేర్కొన్నారు.
"నూరు కౌంట్ పొందూరు నేతలో ప్రత్యేకం. ఇందులో వాలుగ చేప దవడతో దూదిని ఏకిన తరవాత మగ్గానికి చేరే ముందు వివిధ దశల్లో శుద్ధిచేస్తాము. ఏరటం, నిడవటం, ఏకటం, పొల్లు తియ్యటం, మెత్తబరచటం, ఏకు చుట్టడం, వడకటం, చిలక చుట్టడం ఇలా నూరు కౌంట్లో ఎనిమిది దశలు ఉంటాయి. మేమే పత్తి కొనుక్కుని ప్రత్యేక పనిముట్లను ఉపయోగించి ప్రత్యేక పద్ధతుల్లో సన్నని, స్వచ్ఛమైన నూలుపోగులు తయారు చేసుకుంటాము. ఈ పద్ధతిని నూరు కౌంట్ అంటారు. ఆ స్వచ్ఛమైన నూలుపోగులతోనే పొందూరు చీరలు రూపొందిస్తాము. మా దగ్గర తయారయ్యే అన్ని చీరల్లో జాందానీ చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పూర్తిగా చేతులతోనే నేస్తాం. ఒక్కో చీర ధర రూ.4000 నుంచి రూ.15000 వరకూ ఉంటుంది. తయారీకి 15 నుంచి 20 రోజులు పడుతుంది. ధరతో ఎలాంటి సంబంధం లేకుండా మేం నేసిన చీరలకు మంచి డిమాండ్ ఉంది. మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, గాంధీజీ మనవరాలు తారాగాంధీ వంటివారు మా పొందూరు చీరల్ని ఎంతగానో ఇష్టపడ్డారు" అని అనకాపల్లి శ్రీదేవి నేత కార్మికురాలు చెప్పుకొచ్చారు.
అమ్మో.. ఈ చీర ధర రూ.21 లక్షలు.. అంత స్పెషలేంటో?
మోదీకి వివరించి : 75 ఏళ్ల జల్లేపల్లి కాంతమ్మ ఆరేళ్ల ప్రాయం నుంచి ఈ నేత పనిలోనే ఉన్నారు. నూలును నాణ్యంగా వడికే నైపుణ్యం ఉన్న అతి కొద్ది మందిలో కాంతమ్మ ఒకరు. గాంధీజీ సిద్ధాంతాల్ని ఇప్పటికీ ఆచరిస్తోన్న కాంతమ్మని కలవడానికి దేశం నలుమూలల నుంచి చేనేత ప్రేమికులు వస్తూనే ఉంటారు. 2013లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రావాల్సిందిగా ఎర్రకోట నుంచి ఆహ్వానాన్ని కాంతమ్మ అందుకున్నారు. అప్పుడే ప్రధాని మోదీకి ఖాదీ గొప్పతనం వివరించి, తన చేతులతో వడికిన నూలును కాంతమ్మ బహుకరించారు. అయితే ఇంత పేరున్నా పొందూరు నేతలకు ఆర్థికంగా ప్రోత్సాహం లేకపోవడంతో తరవాత తరాలు ఈ విద్యపై ఆసక్తి చూపించడం లేదని నేత కార్మికులు బాధపడుతున్నారు.
'చేనేత' ఇక గతమేనా?- మగ్గం నేసిన చేతులు మట్టి పనుల్లో! - Handloom Workers Problems