First Govt Engineering College In Kodangal : రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ కాలేజీగా మారనుంది. ఈ మేరకు పాలిటెక్నిక్ కళాశాలను ఉన్నతీకరిస్తూ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం(2024-25) నుంచే ఇక్కడ ఇంజినీరింగ్ తరగతులను ప్రారంభించనున్నారు.
అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ కళాశాలలో బీటెక్ సీఎస్‌ఈ, సీఎస్‌ఈ (ఏఐ అండ్ ఎంఎల్), సీఎస్‌ఈ (డేటా సైన్స్) కోర్సులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంజినీరింగ్ కళాశాలగా స్థాయి పెరిగినప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు యథాతథంగా కొనసాగనున్నాయి. ఆయా కోర్సులకు అదనంగా బీటెక్ బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నారు.
Kosgi Govt Engineering College : ఇంజినీరింగ్ విద్య మొదలైనప్పటినుంచి ప్రైవేటు కాలేజీలదే హవా. యూనివర్శిటీల్లో ఇంజినీరింగ్ విభాగాలు ఉన్నా కూడా అవన్నీ క్యాంపస్ లో అంతర్భాగంగానే ఉంటాయి. జేఎన్‌టీయూహెచ్, ఉస్మానియా, మహాత్మాగాంధీ యూనివర్శిటీల పరిధిలో ఈ కాలేజీలు ఉన్నాయి. పనిగట్టుకుని ప్రభుత్వ రంగంలో ఇంజినీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయలేదు. అయితే తొలిసారి కోస్గి ఇంజినీరింగ్ కళాశాల మాత్రం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మౌలిక వసతులు, విద్యార్థుల భోదన, బోధనేతర సిబ్బందుల నియమించడం, వారి జీతాలు తదితర వాటిని ఆ శాఖే నిర్ణయిస్తుంది.
ప్రభుత్వ లేదా ప్రైవేటు కళాశాలు ఏదైనా ఏదో ఒక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంటుంది. అంటే ఒక వర్సిటీ నుంచి అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) తీసుకోవాలి. ఆ విశ్వవిద్యాలయం రూపొందించిన సిలబస్‌ను ఆ కళాశాల పాటించాలి. కళాశాల పరీక్షల నిర్వహణ, ధ్రువపత్రాల వంటివి జారీ వర్సిటీ చేస్తుంది. ఈ మేరకు కోస్గిలో ఏర్పాటయ్యే ఇంజినీరింగ్ కళాశాల జేఎన్‌టీయూహెచ్‌కు అనుబంధంగా ఉండనుంది.
First Govt B.tech College In Telangana : ఇంజినీరింగ్ కళాశాలగా స్థాయి పెరిగినా ప్రస్తుతం కొనసాగుతున్న పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు యథాతథంగానే కొనసాగుతాయి. కోస్గి పాలిటెక్నిక్ కళాశాలను 2014లో 5 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించారు. అక్కడ సివిల్, మెకానికల్, ఈసీఈ బ్రాంచీలు (180 డిప్లొమా సీట్లు) అందుబాటులో ఉన్నాయి. వాటికి అదనంగా బీటెక్ బ్రాంచీలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం పాలిటెక్నిక్ కోర్సులకు భోదిస్తున్న అధ్యాపకులు సరిపోతారని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే అక్కడ హాస్టల్ సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చిందని ఒక అధికారి తెలిపారు.