Film Celebrities Paid Tribute to Ramoji Rao : "అంధకారంలో మగ్గిన ఎన్నో జీవితాల్లో ఆ ఆలోచనాసమాహారం వెలుగులు నింపింది. మట్టిలో మాణిక్యాలెన్నింటినో ఉన్నత శిఖరాలకు చేర్చింది. రాజ్యాన్ని ఏలే రాజకీయరంగమైనా, తారలు తళుక్కుమనే వినోద ప్రపంచమైనా, ప్రశ్నించే గొంతుకల పాత్రికేయలోకంలోనైనా ఎంతో మందిని నూతన శిఖరాలకు చేర్చిన మహాయోధుడు రామోజీ."
ఆయన మరణవార్త విన్న సినీలోకం శోకసంద్రంలో మునిగింది. ఫిల్మ్‌సిటీలో ఆయన పార్థివదేహం వద్ద చేరి పలువురు సినీ ప్రముఖులు అంజలి ఘటించారు. మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, నరేశ్, కల్యాణ్‌రామ్, సాయికుమార్, గోపీచంద్, శ్రీను వైట్ల, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, గీత రచయిత చంద్రబోస్, గాయకుడు ఎస్పీ చరణ్ తదితరులు నివాళులర్పించారు.
రైతుబిడ్డగా మొదలై మీడియా మహాసామ్రాజాన్ని నిర్మించిన యోధుడు రామోజీ రావు - Ramoji Rao Biography
తెలుగు వార్తా రంగంలో, వినోదరంగంలో ఆయన ఎనలేని కృషి చేశారని సినీ ప్రముఖులు గుర్తుచేసుకున్నారు. ఆయన స్థాపించిన టీవీ ఛానల్ ఎన్నో భాషల్లో విస్తరించాయని, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా సేవలు అందించారని స్మరించుకున్నారు. ఎంతోమంది కొత్త వారిని సినీరంగానికి పరిచయం చేసిన ఘనతే ఆయనకే చెందుతుందని పలువురు సినీ తారలు శ్లాఘించారు. రామోజీ ఫిల్మ్‌సిటీ గిన్నిస్ బుక్ రికార్డుల్లో స్థానం సొంతం చేసుకోవడం ఎంతో గర్వకారణమని, ఆయన చేసిన సేవలు ప్రతీ భారతీయుడి మదిలో ఎప్పటికీ గుర్తుంటాయని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి రామోజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది.
Rajendra Prasad Pays Tribute to Ramoji Rao : రాబోయే తరాలకు రామోజీరావు ఒక మార్గదర్శి అని ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. రామోజీ పార్థివదేహానికి నివాళులర్పించిన ఆయన, రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని కన్నీటిపర్యంతమయ్యారు.
ఎంతో మంది నటులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు : 'తొలి చూపులోనే' సినిమాతో తన సినీ ప్రస్థానం మొదలైందని, తనలాగే ఎంతో మంది సినీతారలకు అవకాశం ఇచ్చారని నందమూరి కల్యాణ్ రామ్ గుర్తుచేసుకున్నారు. టీవీలోనూ రచయితలు, నటులను పరిచయం చేశారని, ఈనాడు, ఈటీవీల ద్వారా నమ్మకమైన వార్తలను అందించిన వ్యక్తి అని వివరించారు. సినిమా ఇండస్ట్రీకి రామోజీ ఫిల్మ్ సిటీ గొప్ప ఆస్తి అన్న ఆయన, ఏ షూటింగ్ అయినా సులభంగా ఇక్కడ జరిగిపోతుందని తెలిపారు. ఆయన మరణం కలచివేస్తోందని, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు.
Mohan Babu Pays Tribute to Ramoji Rao : రామోజీరావు చేసిన సేవలు చిరస్మరణీయమని సినీ నటుడు మోహన్‌బాబు అన్నారు. రామోజీరావుగారితో తనకు 43 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఆయన పార్థివదేహానికి మోహన్‌బాబు, ఆయన కుమార్తె లక్ష్మి, కుమారులు విష్ణు, మనోజ్ నివాళులర్పించారు. నిరంతరం ప్రజల కోసం పాటు పడే వ్యక్తి ఆయన గుర్తు చేసుకున్నారు.
Naresh Pays Tribute to Ramoji Rao : భారతదేశ సినిమా ప్రపంచవ్యాప్తంగా కీర్తీ ప్రతిష్ఠలు గడించడానికి రామోజీరావు చేసిన కృషి అనిర్వచనీయమంటూ నటుడు నరేశ్ కీర్తించారు. ఆయన లేనిలోటు పూడ్చలేనిదంటూ భావోద్వేగానికి గురయ్యారు. అన్నింటా తనకు వెన్నుదన్నుగా నిలిచిన రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
తెలుగు పత్రికారంగంలో చెరగని ముద్ర వేసిన రామోజీరావు - Ramoji Rao Services to Telugu Media
రామోజీరావు కీర్తి అజరామరం: చంద్రబాబు - Chandrababu On Ramoji Rao Demise