Constable Murder Case Update : హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ హత్య కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకుందనే కోపం, ఎకరం భూమి తనకివ్వలేదనే కక్షతో సొంత అక్కను తమ్ముడే కిరాతకంగా హత్య చేశాడు. హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారణం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన కొంగర నాగమణి (27) 2020లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం హయత్‌నగర్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు అక్క, తమ్ముడు ఉన్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో వాళ్ల పెద్దనాన్న దగ్గరే పెరిగారు. కాగా పదేళ్ల కిందట నాగమణికి పెళ్లైంది.
భర్తతో మనస్పర్ధలు రావడంతో 2022లో విడాకులు తీసుకుంది. అనంతరం స్వగ్రామానికే చెందిన చిన్ననాటి స్నేహితులుడు బండారి శ్రీకాంత్‌ను ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శ్రీకాంత్ తక్కువ కులానికి చెందిన వాడనే కారణంతో సోదరుడు పరమేశ్ పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ విషయంలో ఇంట్లో పలుమార్లు గొడవలు జరిగాయి. సోదరుడు, పెద్దలు అంగీకరించకపోయినా ఇద్దరు ఈ ఏడాది నవంబరు 10న యాదగిరి గుట్టలో పెళ్లి చేసుకున్నారు. తమ్ముడితో ముప్పు ఉంటుందని భావించిన నాగమణి ఇబ్రహీంపట్నం పోలీసులను సంప్రదించి రక్షణ కోరగా వారు ఇరు కుటుంబాలని పిలిపించి సర్ది చెప్పారు. ప్రస్తుతం నాగమణి దంపతులు మన్సూరాబాద్‌లో ఉంటున్నారు.
మత్తు మందు ఇచ్చి, ఒంటికి నిప్పంటించి - ఆ 'బంగారం' కోసం భార్యపై భర్త ఘాతుకం
వివాహమైన తర్వాత తొలిసారి శనివారం నాగమణి స్వగ్రామానికి వచ్చిందని తెలుసుకున్న పరమేశ్ ఆమెను హతమార్చాలని అనుకున్నాడు. సోమవారం విధులు నిమిత్తం హయత్‌నగర్ వెళుతుందని తెలుసుకున్నాడు. ఉదయం 8గంటలకు ఆమె రాయపోల్ నుంచి ద్విచక్ర వాహనంలో బయలుదేరగానే ఆమెను కారులో అనుసరించాడు. మనవూరు సబ్‌స్టేషన్ వద్ద వెనుకనుంచి ఢీ కొట్టగా ఆమె కింద పడిపోయింది. ఆ తర్వాత కొడవలితో మెడ, ముఖం మీద నరకడంతో నాగమణి అక్కడికక్కడే మృతి చెందారు.
'ఘటనకు కొద్ది సమయం ముందు నాగమణి నాతో ఫోన్‌లో మాట్లాడింది. డ్యూటీకి వెళ్తున్నావా అని అడిగేలోపే పెద్ద సౌండ్ వచ్చింది. ఏమైంగని అడగ్గా తమ్ముడు కారు ఢీతో కొట్టాడని, నన్ను చంపుతున్నాడని చెప్పింది కాసేపటికి మాటలు ఆగిపోయాయి' అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మృతురాలి భర్త పేర్కొన్నారు. హత్య అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు. నాగమణి హత్యను నిరసిస్తూ భర్త, అతని కుటుంబ సభ్యులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ముందు రహదారిపై బైఠాయించారు. ఇది నూరు శాతం పరువు హత్య అని నిందితుడు, అతనికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ప్రేమించి పెళ్లి చేసుకుంది - ఆ బంధానికి అడ్డొస్తున్నాడని అంతమొందించింది