Driverless Metro Train Features in Chennai : దారి పొడవునా సెన్సార్లు. అధునాతన లాకింగ్ వ్యవస్థ. ఎంత వేగంగా వెళ్లాలో, ఎక్కడ ఆగాలో, అందులోనూ ఎంతసేపటికి నిలవాలో అన్నీ డిజిటల్‌గా నమోదు చేసిన సమయాల ప్రకారం జరిగిపోతాయి. నిమిషం కూడా ఆలస్యం కాకుండా ప్రణాళిక ప్రకారం పక్కాగా రాకపోకలు జరిగేలా సాధ్యమవుతాయి. ఇలా చెన్నై నగరంలో నడవనున్న డ్రైవర్ రహిత మెట్రో రైలు విశేషాలు చాలా ఉన్నాయి.
36 డ్రైవర్ రహిత రైళ్లు : తిరుపతి శ్రీసిటీలోని ఫ్రాన్స్‌కు చెందిన ఆల్‌స్టోమ్ ఫ్యాక్టరీలో తయారైన తొలి డ్రైవర్ రహిత మెట్రోరైలు ఇటీవలే చెన్నై చేరుకుంది. పూందమల్లి డిపోలో ఉంచారు. దీపావళి పండుగ తర్వాత ట్రయల్‌రన్‌తో అన్ని రకాల నాణ్యత, భద్రత ప్రమాణాల పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆల్‌స్టోమ్ సంస్థ నుంచే మరో 36 డ్రైవర్ రహిత రైళ్లకు ఆర్డర్లు ఇచ్చారు. ఇందుకు రూ.1,215.92 కోట్లు వెచ్చిస్తున్నారు. 36 రైళ్లలో ప్రతిదానికి మూడు కోచ్‌లు (కార్లు) చొప్పున 108 కోచ్‌లు రానున్నాయి. కొద్ది నెలల్లో విడతల వారీగా చెన్నై నగరానికి చేరుకోనున్నాయి.
వారి భద్రతకు ప్రాధాన్యం : డ్రైవర్ రహిత మెట్రో రైలు మోడల్‌ను మెట్రో పోలిస్ అంటున్నారు. పూర్తి ఆటోమేటిక్‌గా రాకపోకలు సాగించేలా సాంకేతికతను ఇందులో వాడారు. పట్టాలపై సురక్షితంగా వెళ్లేలా, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేలా ఇందులో భాగంగా ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్(ATO), ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్(ATP) సాంకేతికత వినియోగించారు.
విజయవాడ మెట్రో అమరావతికి అనుసంధానం - కేంద్రమంత్రితో నారాయణ చర్చలు
2025 డిసెంబరులోపు పూర్తి : మెట్రోరైలు ప్రాజెక్టు ఫేజ్-2లో నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. పూందమల్లి నుంచి లైట్హౌస్ మధ్య నాలుగో కారిడార్ కింద పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడే ప్రయోగాత్మకంగా నడపనున్నారు. ఈ లైనులోనే ఉన్న పూందమల్లి-పోరూరు మెట్రోస్టేషన్ల మధ్య పనులు 2025 డిసెంబరులోపు పూర్తి అవుతాయని చెబుతున్నారు. ఈ 2 స్టేషన్ల మధ్యే తొలి రైలు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నిపుణుల పర్యవేక్షణలో రాకపోకలు : టెస్లా సంస్థకు చెందిన వాహనాలు ఎలాంటి మానవ ప్రమేయం లేకుండానే నడిచేలా తయారయ్యాయి. ఈ డ్రైవర్ రహిత రైలు కూడా అదే తరహా సాంకేతికతతో ఉన్నా, ఇది పూర్తిగా రిమోట్ కంట్రోల్ వ్యవస్థతో నిపుణుల అదుపులో ఉండేలా చేస్తున్నారు. ఇది వరకే ఈ తరహా అధునాతన రైలు వ్యవస్థలు సిడ్నీ, పారిస్‌లలో ఉన్నాయి. ఇందులో డ్రైవర్ లేకపోయినా పూర్తి స్థాయిలో నిపుణుల పర్యవేక్షణ, వారి నియంత్రణలోనే రాకపోకలు సాగించనుంది.
రిమోట్ విధానంలో నడిపించేలా ఏర్పాట్లు : అత్యవసర సమయంలో కంట్రోల్‌రూమ్ నుంచే బ్రేక్‌లు వేసేందుకు వీలుగా సాంకేతికత తెస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారానే వేగాన్ని పెంచడం, తగ్గించడం లాంటివీ చేస్తారు. మెట్రో కంట్రోల్ రూమ్ నుంచే ఈ రైలు పని తీరును రిమోట్ విధానంలో, వివిధ సీసీ కెమెరాల సాయంతో దీన్ని నడిపించేలా ఏర్పాట్లు చేశారు.
కంట్రోల్ రూమ్‌తో మాట్లాడేలా : ప్రయాణికులు ఎలాంటి అనుమానాలు లేకుండా సురక్షితంగా రాకపోకలు సాగించేలా కంట్రోల్‌రూమ్ నుంచే నిపుణులు ప్రయాణికులకు జాగ్రత్తలు చెప్పేలా కోచ్ డిజైన్ చేశారు. ఇంటర్‌కమ్ వ్యవస్థ ద్వారా ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడం, అలాగే అవసరమైనప్పుడు, మరేదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే కంట్రోల్ రూమ్‌తో మాట్లాడేలా ప్రతి కోచ్‌లో ఈ ఇంటర్‌కమ్ వ్యవస్థల్ని తెచ్చారు. మీట నొక్కడం ద్వారా ఈ వసతిని ఉపయోగించవచ్చు.
సెన్సార్లతో పరీక్షలు : పట్టాలు ఉన్నచోట్ల సెన్సార్లు అమర్చుతున్నారు. దీంతో పాటు ఇంటెలిజెన్స్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థను వాడుతున్నారు. వాటిని కంట్రోల్ రూమ్‌తో అనుసంధానిస్తున్నారు. రైలు బయలుదేరే ముందు ఈ సాంకేతిక వ్యవస్థల ద్వారా రూట్ మొత్తం సురక్షితంగా ఉందా లేదా, పట్టాలు భద్రంగా ఉన్నాయా లేవా అనేది డిజిటల్ రూపంలోనూ స్పష్టత తీసుకుంటారు. అంతా సవ్యంగా ఉంటేనే రైలు వెళ్లేందుకు డిజిటల్ వ్యవస్థలు అనుమతి ఇస్తాయి. వాటి ఆధారంగా కంట్రోల్ రూమ్ నిపుణులు రైలును రిమోట్‌తో నడిపిస్తారు. ప్రతి ప్రయాణానికి ఈ తరహా పరీక్షలుంటాయి.
పెద్ద తెరలు ఏర్పాటు : ఒకవేళ ఎక్కడైనా లోపం ఉన్నట్లు కనిపిస్తే, సాంకేతిక వ్యవస్థ ప్రయాణానికి అనుమతి ఇవ్వదు. పైగా పట్టాల్లో ఉన్న డిజిటల్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ రైలును వెళ్లనివ్వదు. లోపం సరిచేయగానే అనుమతి లభిస్తుంది. మరో వైపు పట్టాలపై వెళ్తున్న రైలు సవ్యంగా నడుస్తోందా లేదా అని కూడా అదే వ్యవస్థ ద్వారా సాంకేతికంగా పర్యవేక్షిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం కంట్రోల్ రూమ్‌లో కంట్రోల్ ప్యానెల్, డిజిటల్ ప్యానెల్స్‌పై కనిపిస్తూనే ఉంటుంది. ఇందుకోసం పెద్ద తెరలు ఏర్పాటు చేస్తున్నారు.
సదుపాయాలు :
- ఏ మాత్రం ఆలస్యం లేకుండా సమయానికి రైలుస్టేషన్‌కు చేరడం
- పట్టాలపై రైళ్ల రాకపోకల సంఖ్యను మరింతగా పెంచడం
- అన్ని కోచ్‌ల్లో సీసీ కెమెరాలు
- యూఎస్‌బీ సాచెట్లు అందుబాటులో ఉంచి మొబైల్ ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటు
- డిజిటల్ తెరల ద్వారా తర్వాతి స్టేషన్ సమయాల్ని కచ్చితంగా ఇవ్వడం
- రైలు వెనక కోచ్‌లో ఆహ్లాదంగా నుంచుని పరిసరాలు చూసేలా ప్రత్యేక ఏర్పాట్లు
- దివ్యాంగులు తమ వీల్‌ఛైర్‌లోనే ప్రయాణించేలా ప్రత్యేక స్థలం
పట్టాలపైకి విశాఖ మెట్రో- సీఎం చంద్రబాబు ఆదేశాలతో కదలిక - VISAKHA METRO