Father And Son Died in Dog Attack in Visakha : అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ పెంపుడు కుక్కే వారి పాలిట మరణశాసనం రాస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆ కుటుంబంలో ఓ సభ్యుడిగా చూసుకుంటున్న ఆ శునకమే ఆ ఫ్యామిలీలో పెను విషాదం నింపుతుందని కలలో కూడా అనుకొని ఉండరు. తండ్రీకుమారుడిని కరిచిన పెంపుడు కుక్క మరణించడంతో భయాందోళనకు గురైన వారు వెంటనే రేబీస్ టీకా తీసుకున్నారు. ఏమైందో ఏమో కానీ నాలుగు రోజుల క్రితం కుమారుడు మృతి చెందగా, మంగళవారం రోజున తండ్రి మరణించాడు. కుక్క కరిచిన వారం రోజుల్లోనే ఇంట్లో ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబం పెను విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా భీమిలి జోన్ ఎగువపేటలో చోటు చేసుకుంది.
కుక్క పేరు చెబితే విశ్వాసానికి ప్రతీక అని అంటారు. పెంపుడు కుక్కలు ఇంటిని సురక్షితంగా కాపాడటమే కాదు, బోలెడు కాలక్షేపాన్ని పంచుతాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. రౌడీలు, గుండాల కన్నా, వీధి కుక్కలను చూస్తేనే ఇప్పుడు జనం ఎక్కువ భయపడిపోతున్నారు. కొన్ని కాలనీల్లో ఐతే ఇళ్లల్లో నుంచి అడుగు తీసి బయటపెట్టాలంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వణికిపోతున్నారు.
మీ ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారా? - ఈ విషయాలు తెలుసుకోకపోతే అంతే!
ఇక తాజాగా వీధి కుక్కలతో సమానంగా పెంపుడు కుక్కలు సైతం మరణానికి కారణమవుతున్నాయి. ఎంత ప్రేమగా చూసుకున్నా, ఎన్ని వ్యాక్సిన్లు వేయించి జాగ్రత్తగా కాపాడుకున్నా కొన్నిసార్లు పెంపుడు శునకాల వల్ల యజమానులు ప్రాణాలు కోల్పోతున్నారు. మే నెలలో పెంపుడు కుక్క దాడిలో ఓ 5 నెలల పసికందు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇలాంటి ఘటనే తాజాగా ఏపీలోని విశాఖ జిల్లాలో చోటు చోసుకుంది. పెంపుడు కుక్క కాటులో తండ్రి, కుమారుడు మృతి కన్నుమూశారు.
విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ ఎగువుపేటలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. సరదా కోసం పెంచుకున్న కుక్క కరవడంతో తండ్రి కొడుకు మృతి చెందిన సంఘటనతో ఈ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులను గాయపర్చిన కుక్క రెండు రోజులకే మృతి చెందడంతో భీమిలి ప్రభుత్వాసుపత్రిలో రేబిస్ వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మృతిని బంధువులు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం భీమిలి జోన్ ఎగువపేటలో మత్స్యకార కుటుంబానికి చెందిన అల్లిపల్లి నర్సింగరావు(59), అల్లిపల్లి చంద్రావతి(57), కుమారుడు భార్గవ్(27) తో నివాసముంటున్నారు. వీరు సరదా కోసం కుక్కను పెంచుకుంటున్నారు.
చుట్టూ శునకాలు - అరచేతిలో ప్రాణాలు - ఆ వృద్ధురాలు ఏం చేసిందంటే? - Street Dogs Attack Old Woman
కొద్ది రోజుల క్రితం కుటుంబ యజమాని అల్లిపల్లి నర్సింగ్ రావు, భార్య చంద్రావతి కుమారుడు భార్గవ్‌ను పెంచుకున్న కుక్క గాయపరిచింది. గాయపరిచిన కుక్క రెండు రోజుల్లోనే మృతి చెందడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రేబిస్ వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్నారు. గత రెండేళ్లుగా కుటుంబ యజమాని అల్లిపల్లి నర్సింగరావు పక్షవాతంతో బాధపడుతున్నాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో అల్లిపెల్లి భార్గవ్ గత నాలుగు రోజుల క్రితం మృతి చెందాడు. మంగళవారం కుటుంబ యజమాని కూడా మరణించడంతో ఈ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుక్క గాయపరిచిన మూడో వ్యక్తి చంద్రావతి ప్రస్తుతం ఆరోగ్యం గానే ఉందని వైద్యులు తెలిపారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబాన్ని భీమిలి అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ కల్యాణ్ చక్రవర్తి పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. నాలుగు రోజుల క్రితం మృతి చెందిన భార్గవ్, తల్లి చంద్రావతి మా హాస్పిటల్లోనే మే 31న వ్యాక్సిన్ వేయించుకున్నారని తెలిపారు. తండ్రి నరసింగరావు మాత్రం గత రెండేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారన్నారని, దీంతోనే ఆయన మృతి చెందాడని అన్నారు. తల్లి కొడుకు మొదటి డోస్ మాత్రమే వేయించుకున్నారని, మిగతా డోస్‌లు వేయించుకోకపోవడంతోనే భార్గవ్ మృతి చెందాడన్నారు. తల్లి చంద్రావతి ఆరోగ్యంగానే ఉందని తెలిపారు.
మంచిర్యాలలో పిచ్చి కుక్క స్వైర విహారం - ఏకంగా ఓ వ్యక్తి బొటనవేలును కొరికేసిన శునకం