Pattiseema Lift Irrigation Project : ఒట్టిసీమ అంటూ గత పాలకులు హేళన చేసిన పట్టిసీమే నేడు రైతుల పాలిట బంగారుసీమగా మారింది. వర్షాలు కురవక కాలువలకు సాగునీరు రాక కళ్లెదుటే ఎండిపోతున్న పంటలను చూసి నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులకు గోదావరి జలాలు ఊరటనిస్తున్నాయి. గోదారి గలగల పారుతూ కృష్ణమ్మ ఒడికి చేరడంతో అన్నదాతల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇక తమ కష్టాలు తీరతాయని సిరులు పండిస్తామని కర్షకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పట్టిసీమకు మళ్లీ జీవం : ప్రాజెక్టుల ప్రాధాన్యత తెలిసిన ప్రభుత్వం అధికారంలోకి రావడం దార్శనికత కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి కావడంతో పట్టిసీమ మళ్లీ జీవం పోసుకుంది. ఎక్కడ గోదావరి ఎక్కడ కృష్ణమ్మ? పట్టిసీమ ద్వారా రెండు నదులను అనుసంధానం చేసి చంద్రబాబు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన గోదావరి నీరు హద్దులు దాటుకుంటూ ఉమ్మడి కృష్ణా జిల్లా సరిహద్దుల్లోని పల్లెర్లమూడి వద్ద కృష్ణా జిల్లా భూభాగాన్ని తాకింది.
ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న పవిత్ర సంగమానికి చేరుకుని అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజికి చేరాయి. నల్లటి కృష్ణా నదిలోకి జేగురు రంగులోని గోదావరి జలాలు కలవడంతో నీరు కొత్త రూపు సంతరించుకుంది. పోలవరం కుడికాల్వ ద్వారా గోదావరి జలాలు కృష్ణమ్మ ఒడికి చేరడంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు.
"మేము ఇప్పుడే నారుమళ్లు పోశాం. వర్షాలు రాక నీటి ఎద్దడిగా ఉంది. ఇలాంటి తరుణంలో పోలవరం ద్వారా పట్టిసీమకు నీళ్లు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ నీళ్లులను మోటార్ల ద్వారా చెరువులలో నింపుకొని రెండు పంటలను పండిస్తాం. ఇవే మాకు తాగునీరు, సాగునీరుగా వినియోగించుకుంటాం. ఈ పట్టిసీమ లేకపోతే మాకు ఆధారం లేదు. ఇందుకు చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటాం" -రైతులు
చిగురించిన రైతుల ఆశలు : ఖరీఫ్ సీజన్లో వర్షాలు లేక అల్లాడుతున్న అన్నదాతలకు పట్టిసీమ నుంచి జాలువారుతున్న గోదావరి జలాలు ఆశలు రేకితిస్తున్నాయి. ప్రస్తుతం 3 పంపుల ద్వారా 6వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. దశలవారీగా మొత్తం 24 పంపుల ద్వారా 8 వేల క్యూసెక్కులను అనుసంధానం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం కృష్ణా డెల్టాలో రైతులు నారుమళ్లు పోశారు. నారుమడికి ఆరుతడి చాలా అవసరం. కృష్ణా కాలువల్లో నీరు లేక చాలా మంది బోర్ల ద్వారా నారుమళ్లను కాపాడుకుంటున్నారు. వర్షాల కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నా వరుణుడు కరుణించడం లేదు. కొంతమంది రైతులు వెదజల్లే పద్ధతిని అనుసరిస్తున్నారు. అవి కూడా మొక్క దశలో పాడైపోయే స్థితికి చేరుకుంటున్న తరుణంలో తాజాగా వస్తున్న నీరు వరికి ఊపిరి పోసింది.
చదువంటే ఉద్యోగమేనా!- వ్యవసాయంలో వెంకటాంపల్లి యువత విజయబావుటా - Young Farmers
విజయవాడ గ్రామీణ ప్రాంతం నున్న, తదితర గ్రామాల్లో పట్టిసీమ నీరు పోలవరం కాలువ ద్వారా పొలాలకు చేరుతోంది. గోదావరి జలాలకు చౌడు పొలాలను సైతం సారవంతం చేసి ఎకరానికి 50 బస్తాల వరకూ అధిక దిగుబడులను ఇచ్చిన చరిత్ర ఉంది. ఇప్పుడు ఆపద సమయంలో పట్టిసీమే తమను కాపాడుతుందని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ సర్కార్ చేసిన పాపం- తోటపల్లి ప్రాజెక్టు రైతులకు శాపం - Thotapalli Project Works