Family Suicide Attempt due to Debts: అప్పుల బాధలు తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. అప్పు ఇచ్చినవారి వేధింపులతో కల్యాణదుర్గం మండలం గూబనపల్లి గ్రామ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం: కర్ణాటకలోని పావగడకు చెందిన సురేశ్, భార్య కరుణ, కుమారుడు యతీశ్ బజ్జీల కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఉరవకొండకు చెందిన ప్రవళికతో యతీశ్కు ఐదు నెలల కిందట వివాహం అయింది. ప్రస్తుతం ఆమె గర్భిణికావడంతో పుట్టింట్లో ఉన్నారు. మూడేళ్ల కిందట వారు రాజు అనే వ్యక్తి దగ్గర రూ.18 లక్షలకు కారును కొనుగోలు చేసి రూ.5 లక్షలు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తూ వస్తున్నారు.
తర్వాత రాజు వద్దనే మరో రూ.2 లక్షలు అప్పు తీసుకున్నారు. రోజుకు రూ.7 వేలు చొప్పున రూ.35వేలు చెల్లించారు. రావాల్సిన బాకీ మొత్తం చెల్లించాలని ఒత్తిడి చేస్తూ రాజు వారిని రోజూ అసభ్య పదజాలంతో దూషిస్తూ కారు తన పేరుపై ఉందని కొన్ని రోజుల కిందట తీసుకెళ్లిపోయాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన వీరు ఈ నెల 25న బళ్లారి హోస్పేట కోరుకొండ ప్రాంతాలలోని బంధువుల ఇంటికి మరో కారులో వెళ్లారు.
టికెట్ ఇవ్వలేదని మనస్తాపం!- పురుగుల మందు మింగి ఎంపీ ఆత్మహత్య
గురువారం ఉదయం గూబనపల్లి గ్రామం వద్ద రోడ్డుపై కారు నిలిపి వారి బాధను వీడియో ద్వారా రికార్డ్ చేసి బంధువులకు పంపారు. వారి వెంట తెచ్చుకున్న పురుగుల మందును ముగ్గురూ తాగి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ తమను కాపాడాలంటూ కేకలు వేశారు. అటుగా వస్తున్న ఓ ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ అది గమనించి వారిని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైద్యులు వారిని అక్కడి నుంచి అనంతపురం ఆస్పత్రికి తరలించారు.
ఐదుగురు కుమార్తెలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం: మరోవైపు జిల్లాలోని చిలమత్తూరులో ఐదుగురు కుమార్తెలతో కలిసి ఓ తల్లి బలవన్మరణానికి యత్నించింది. వివరాలివి: కర్ణాటకాంధ్ర సరిహద్దు చిలమత్తూరు సమీపంలోని మరువకుంటపల్లికి చెందిన అనిత(30) తన భర్త, ఐదుగురు కుమార్తెలతో కలిసి బాగేపల్లి సమీపంలోని ఒక గ్రామంలో నివాసం ఉంటోంది.
అయితే భర్త వేధింపులు, ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న ఆమె తన కుమార్తెలకు విషం తాగించి, తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన స్థానికులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని చిక్కబళ్లాపుర జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అనిత ప్రస్తుతం గర్భిణి అని వైద్యులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వైసీపీ వల్లే మా కుటుంబం ఆత్మహత్య అంటున్న కుమార్తె - అప్పుల బాధతోనే అంటున్న పోలీసులు