Family Members Carried Pregnant on Doli: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గర్భిణీల డోలిమోతలు ఆగడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, పాలకులు ఎవరైనా కూడా గిరిపుత్రుల కష్టాలు మాత్రం మారడం లేదు. దీంతో గిరిజనుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటోంది. కనీసం రోడ్డు సౌకర్యం లేక వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం.
తాజాగా అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో రహదారి సౌకర్యం లేకపోవడంతో నిండు గర్భిణీని ఐదు కిలో మీటర్లు డోలీలో మోసుకొని వైద్య కేంద్రానికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుమ్మ పంచాయతీ కర్రిగడ్డ గ్రామానికి చెందిన బడ్నాయిని రాములమ్మ అనే నిండు గర్భిణీని నెలలు నిండటంతో ప్రసవం కోసం వైద్య కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రమాదకరంగా కొండల నడుమ: నొప్పులు మొదలవడంతో తన భర్త బడ్డాయిని సన్యాసిరావు తన అన్నయ్య బడ్డాయిని బొజ్జన్న ఇద్దరూ ఎత్తైన కొండ శిఖర గ్రామం నుంచి గుమ్మ పంచాయతీ కేంద్ర వరకు సుమారు 5 కిలోమీటర్లు డోలీలో మోసుకొని వెళ్లారు. అతి కష్టం మీద ప్రమాదకరంగా ఉన్న కొండల నడుమ డోలీలో మోసుకుని రహదారి మార్గానికి తరలించారు. అక్కడ నుంచి ప్రైవేట్ ఆటోలో ఎస్.కోట ఏరియా హాస్పిటల్‌కి తరలించారు.
ముఖ్యమంత్రి ఓ పక్కన రాష్ట్రంలో ఎక్కడా డోలీలు కనిపించకూడదు అని అధికారులను ఆదేశిస్తున్నా, మరోవైపు క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఏ మాత్రం మారలేదు. కొండ గ్రామాల్లో రహదారులు లేక, ఫీడర్ అంబులెన్స్‌లు మార్గంలో లేక ఇక్కట్లు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ రావడానికి కూడా రోడ్డు మార్గం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా మంజూరైన రోడ్డును వెంటనే ప్రారంభించాలని గిరిజనులు కోరుతున్నారు.
అయితే ఇది కేవలం ఒక ప్రాంతానిది మాత్రమే కాదు. అనేక రంగాలలో మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం. కానీ దేశంలోని చాలా ప్రాంతాలలో ఇప్పటికీ సరైన రహదారి సౌకర్యాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక కొండకోనల్లో ఉండే గిరిజనుల పరిస్థితి అయినా మరీ దయనీయంగా ఉంటోంది. గిరిజనులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లాలంటే ఇప్పటికీ వారికి డోలీలే దిక్కు. ఇక గర్భిణులకు కడుపున బిడ్డ పడినప్పటి నుంచి ప్రసవమయ్యే వరకూ వారికి దినదిన గండమే. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా వైద్యం కోసం సాహసం చేయక తప్పని దుస్థితి. డోలీ కట్టి కిలోమీటర్ల మేర తీసుకుళ్తే గానీ ఆసుపత్రికి చేరుకోలేని దయనీయ స్థితిలో చాలా మంది గిరిజనులు బాధ పడుతున్నారు. దీంతో ప్రసవ సమయంలో సకాలంలో వైద్యం అందక ఎంతో మంది గిరిజన బిడ్డలు నరకయాతన అనుభవిస్తున్నారు.