False Propaganda In The Name Of WOdra : హైడ్రా(హైదరాబాద్ విపత్తుల ప్రతిస్పందన, ఆస్తుల పరిరక్షణ సంస్థ) తరహాలోనే వరంగల్ జిల్లాలో ‘వాడ్రా’ పేరిట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలోని ఇళ్లు, అక్రమనిర్మాణాలు కూల్చివేస్తారని ప్రచారం జరుగుతోంది. ఫలితంగా వరంగల్ నగరంలోని పలు కాలనీవాసులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మంగళవారం ఎస్సార్‌నగర్‌లో బతుకమ్మ ఆటస్థలం పరిశీలించేందుకు వెళ్లిన తహసీల్దార్ ఇక్బాల్‌ను కొందరు స్థానికులు అడ్డుకున్నారు.
ఇళ్లు కూల్చివేస్తారనే తప్పుడు ప్రచారం : ఇళ్లు కూల్చివేస్తారనే తప్పుడు ప్రచారం జరగడంతో తహసీల్దార్ సర్వే కోసమే వస్తున్నారని స్థానికంగా నివాసముంటున్నవారు భయాందోళనలకు గురయ్యారు. తమ ఇళ్లను కూల్చొద్దని కొందరు మహిళలు ఎమ్మార్వోను అడ్డుకొని కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు. కొంతసేపు ఆయన కారును కూడా కదలనివ్వలేదు. దీంతో తన విధులకు ఆటంకం కలిగించారని తహసీల్దార్ ఎనుమాముల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
వరంగల్ ఎస్సార్‌నగర్ పరిధిలోని సర్వే నంబరు 195 రామసముద్రం శిఖం భూమిని అయాన్ (ప్రభుత్వ భూమి)గా మార్చి అక్కడ గుడిసెలు వేసుకున్న స్థానికులకు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇచ్చింది. ఆ ఇళ్ల నిర్మాణం తర్వాత మిగిలిన ప్రభుత్వ భూమిపై కొందరి కన్నుపడింది. ఇంటి నంబర్లపై రిజిస్ట్రేషన్లు చేస్తూ అక్రమంగా ఇతరులకు విక్రయిస్తూ రూ.లక్షల్లో లబ్ధి పొందుతున్నారు కొందరు.
బతుకమ్మ వేడుకల స్థల పరిశీలన నేపథ్యంలో : ఈ క్రమంలోనే సుమారు 20.05 గుంటల ప్రభుత్వ స్థలంలో స్థానికులు కొందరు బతుకమ్మ వేడుకలు నిర్వహించుకునేందుకు స్థానిక ఎమ్మెల్యేను అనుమతి కోరడంతో అందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తమ కబ్జాలో ఉన్న స్థలం ఎక్కడ తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందోనన్న భయాందోళనతో అక్రమార్కులు స్థానికులను వాడ్రా పేరుతో రెచ్చగొట్టారు. శిఖం భూమిలో ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన రెెండు పడక గదుల ఇళ్లను కూల్చేందుకే తహసీల్దార్ ఇక్కడికి వస్తున్నారని తప్పుడు ప్రచారం చేశారు. ఈ విషయం తెలియని స్థానికులు ఆందోళన చెంది తహసీల్దార్‌ను అడ్డుకున్నారు.
2021 రిపోర్ట్ ఇప్పుడు వైరల్ : హైదరాబాద్ కార్పొరేషన్, ఇతర మున్సిపాలిటీల్లో నాలాలు, చెరువులు విచక్షణారహితంగా ఆక్రమణలకు గురవుతున్నాయని 2021లో ఈనాడు పత్రికలో వచ్చిన కథనాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటాగా తీసుకుని ఆ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. అప్పటి కలెక్టర్ గ్రేటర్ వరంగల్ పరిధిలో నాలాలు, చెరువు శిఖం భూములను కబ్జా చేసి నిర్మించిన ఇళ్ల వివరాలకు సంబంధించిన నివేదికను హరిత ట్రిబ్యునల్‌కు(ఎన్జీటీ) సమర్పించారు. ఆ రిపోర్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నివేదికలో ఉన్న ఇళ్లను అధికారులు కూల్చివేస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఈ విషయంపై తహసీల్దార్ ఇక్బాల్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా అది గతంలో ఇచ్చిన రిపోర్టు మాత్రమేనని ఆ నివేదికను అనుసరించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేశారు.
ఆక్రమణలకు ఆస్కారం లేకుండా యాప్ - సిద్ధం చేస్తున్న హైడ్రా
సర్కార్‌కు షాక్, పడిపోయిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం - హైడ్రా ఎఫెక్ట్ ఏమైనా ఉందా?