Cyber Criminals Call Your Son Arrest in Drug Case : ఈ మధ్యకాలంలో టెక్నాలజీ వాడకం విపరీతంగా పెరిగింది. ఆ పెరిగిన టెక్నాలజీని ఆసరాగా తీసుకుని సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త పంథాలో సామాన్య జనాలకు హడలెత్తిస్తున్నారు. అనునిత్యం ఇలాంటి సైబర్ నేరాలను చూస్తూనే ఉన్నాం. వీరి దెబ్బకు ఎంతో మంది లక్షల్లో డబ్బును పోగొట్టుకున్నవారు ఉన్నారు. విద్యావంతులు, వయోవృద్ధులు, చిన్నవారు, చదువుకొనివారు అనే తేడా లేకుండా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.
అయితే ఈ మధ్య కొత్తగా ట్రెండ్ అయిన విషయం ఏంటంటే మీ కుమారుడు/కుమార్తె డ్రగ్స్‌తో పట్టుబడ్డారు. డబ్బులు పంపిస్తే వారిని విడిచి పెట్టేస్తామని పోలీసులు ఫోన్ చేసినట్లు కేటుగాళ్లు మాట్లాడి డబ్బులు గుంజుకుంటున్నారు. అయితే ఇలాంటి సైబర్‌గాళ్లు చేసిన ప్రయత్నాన్ని ఓ మహిళ చాకచక్యంగా ఎదుర్కొని అందరితో శభాష్ అనిపించుకుని అందరికీ మార్గదర్శకంగా మారింది.
కరీంనగర్ అల్కాపురి కాలనీకి చెందిన మునిపల్లి ఫణితకు వాట్సాప్‌లో ఒక కాల్ వచ్చింది. "ఫోన్ కాల్ ఎత్తగానే తన భర్త పేరు చెప్పడమే కాకుండా మీ కుమారుడు ఎక్కడున్నారని గంభీరంగా వారు అడిగారు. మీ కుమారుడిని కెనడాకు చదువుకోవడానికి పంపించారా? లేదా డ్రగ్స్ సరఫరా కోసం పంపించారా అని అడిగారు. తమకు డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. మీరు అతనితో మాట్లాడతారా అని సైబర్ నేరగాడు అడిగాడు. అందుకు నేను సరే మాట్లాడతాను ఇవ్వండి అని అడిగాను. అందుకు అవతలి వ్యక్తి మీరు మీ కుమారుడితో మాట్లాడాలంటే రూ.50 వేలు తమకు పంపించండి. అప్పుడు మీ కుమారుడిని విడిచిపెట్టేస్తామని" డిమాండ్ చేసినట్లు ఆ మహిళ తెలిపారు.
ఆ ఫేక్ కాల్ పాకిస్థాన్ ది : ఈ కాల్‌లో ఆ మాటలు వినగానే కాస్త కంగారు పడిపోయాయని ఆ మహిళ తెలిపారు. అప్పుడే తన దగ్గర రెండు ఫోన్లు ఉండడంతో వెంటనే ఆ ఫోన్‌ను డ్రైవర్‌కు ఇచ్చి కుమారుడికి వీడియో కాల్ చేసి మాట్లాడినట్లు ఆమె చెప్పారు. వెంటనే సైబర్ నేరగాడు డబ్బుకోసం కాల్ చేశాడని గ్రహించి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా ఆ ఫేక్ కాల్ పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి ఫేక్ కాల్స్‌పై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఆ మహిళ అందరికీ సూచించారు. ఆమె చేసిన పనికి అందరి నుంచి ప్రశంసలు అందుతున్నాయి.