Venkata Reddy Efforts to Escape from ACB : వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దల గనుల, ఖనిజ, ఇసుక దోపిడీని సర్వం తానై నడిపించిన గనుల శాఖ పూర్వ డైరెక్టర్ వీజీ వెంకట రెడ్డి ఏసీబీకి (అవినీతి నిరోధక శాఖ) చిక్కకుండా ఉండేందుకు అనేక ఎత్తుగడలు వేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరారైన ఆయన కొన్నాళ్ల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తిరిగారు. తర్వాత దిల్లీలోని మిలటరీ కంటోన్మెంట్‌లో దాదాపు రెండున్నర నెలలు తలదాచుకున్నారు. తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు సిమ్ కార్డులు తీసేసి, ఫోన్లు స్విచాఫ్ చేసేశారు.
ఇండియన్ కోస్ట్‌గార్డు సర్వీసు అధికారైన ఆయన గతంలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని కంటోన్మెంట్‌కు చేరారు. తాను అక్కడే ఉంటే ఏసీబీ సహా ఎవరి దృష్టిలోనూ పడకుండా ఉంటాననే వ్యూహం పన్నారు. అయితే వెంకట రెడ్డి, ఆయన సన్నిహితుల కదలికలపై కొన్నాళ్లుగా నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఆయన దిల్లీ కంటోన్మెంట్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లడానికి దిల్లీ పోలీసులు, కంటోన్మెంట్ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉండటంతో వాటి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న వెంకట రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ వచ్చేసి శంషాబాద్ సమీపం సుల్తాన్‌పల్లిలోని అత్యంత విలాసవంతమైన బ్యూటీగ్రీన్ రిసార్ట్స్‌లో మకాం వేశారు. ఏసీబీ బృందాలు గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుని రాత్రి 8.15 గంటల సమయంలో వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నాయి.
గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి అరెస్ట్ - Venkata Reddy Arrest
విజయవాడ జైలుకు తరలింపు : వెంకట రెడ్డి అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తనకు గుండె శస్త్రచికిత్స జరిగిందని, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన్ను విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు శుక్రవారం అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించారు. శుక్రవారం మధ్యాహ్నం విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం న్యాయాధికారి ఎదుట హాజరుపరిచారు. వెంకట రెడ్డికి అక్టోబరు 10 వరకూ రిమాండు విధిస్తూ న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన్ను విజయవాడ జైలుకు తరలించారు. మరోవైపు వెంకట రెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు వేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.