EX CM KCR MPs Meeting In Erravalli : రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ వైఖరిపై భారత రాష్ట్ర సమితి ఎంపీలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంగా సమావేశం సుదీర్ఘంగా మూడు గంటల పాటు సాగింది. రాష్ట్ర ప్రయోజనాలు, హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ అన్న కేసీఆర్ రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రం తరపున బలమైన వాదనలు వినిపించాలని సూచించారు. నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని కాపాడాల్సిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం లేదని రాష్ట్ర ప్రజల ఆశలు బీఆర్ఎస్ ఎంపీలపైనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.
'తల్లిలాంటి పార్టీని కాపాడుకుంటూ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలి'
BRS Focus On Parliament Elections : అధికారంలో ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందన్న కేసీఆర్ ఆపరేషన్ మ్యానువల్, ప్రోటోకాల్ లేకుండా ప్రాజెక్టులను ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. కేంద్ర జలశక్తి శాఖా మంత్రిని పార్టీ ఎంపీల బృందం ప్రత్యేక కలవాలని ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వాలని తెలిపారు. ఎంపీలు తమ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ పనిచేసుకుపోవాలని సూచించారు.
"కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్‌లను అప్పగించాలని బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు వంటిది. బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి రాష్ట్రానికి త్రీవ అన్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నాయి. ఆరు గ్యారంటీల్లో మొత్తం 13 హామీలు ఉన్నాయి. రెండు లక్షల రుణమాఫీని, 4 వేల పింఛన్‌ను, యాసంగిలో వరికి రూ. 500 బోనస్‌లకు సంబంధించిన జీవోలను ఎన్నికల కోడ్‌లోపు ఇవ్వాలి." -హరీశ్‌రావు , బీఆర్ఎస్ ఎమ్మెల్యే
నాడు నేడు ఎనాడైనా తెలంగాణ గళం, బలం, దళం మేమే : కేటీఆర్
Harish Rao Comments On Krishna River Board : కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల స్వాధీనం సహా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు తదితర అంశాలపై ఎంపీలు పార్లమెంట్‌లో గట్టిగా గళం వినిపించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించినట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రాజెక్టుల అప్పగింత విషయంలో కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయన్న ఆయన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని ఆరోపించారు. కృష్ణా జలాలు సహా తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలను పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని బీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం ఎంపీలతో మరోమారు సమావేశమవుతానన్న కేసీఆర్ త్వరలోనే ప్రజల్లోకి వస్తానని స్పష్టం చేశారు.
త్వరలో బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా - కేసీఆర్, కేటీఆర్ పోటీపై ఇదే క్లారిటీ