Errors in Teacher Adjustment Process in YSR District : ఉపాధ్యాయుల బదిలీ విషయంలో లోపాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటులో సబ్జెక్టుల వారీగా అవసరమున్న పాఠశాలలకు పలువురిని నియమించింది. ఈ క్రమంలోనే సాధారణ ఉపాధ్యాయులను ఉర్దూ పాఠశాలకు పంపిస్తున్నారు. దీంతో పిల్లలకు తెలుగు, ఉపాధ్యాయులకు ఉర్దూ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బదిలీ ప్రక్రియంతా అస్తవ్యస్తంగా తయారు అయ్యిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నారు. కావాల్సిన చోట నియమించకుండా ఇష్టారాజ్యంగా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భాషతో సంబంధం లేకుండా : వైఎస్సార్ జిల్లా కడప నగరపాలక సంస్థ ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఉర్దూ మాధ్యమం అమలు అవుతోంది. ఆ పాఠశాలకు గణితం ఉపాధ్యాయుల అవసరం ఉంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుడి కేటాయించాలి. ఇటీవల జిల్లా విద్యాశాఖ (District Education Department చేపట్టిన సర్దుబాటు ప్రక్రియలో ఉర్దూ భాషతో ఏ మాత్రం సంబంధం లేని సాధారణ ఉపాధ్యాయులను ఆ పాఠశాలకు పంపారు. దీంతో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. కనీసం ఇంగ్లిఘ మీడియం పాఠశాలలైనా ఉర్దూ మినహా మిగిలిన సబ్జెక్టులకు కొంత ఉపశమనం దక్కేది. ఇక్కడ అలాంటి పరిస్థితి కూడా లేకుండాపోయిందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాకు ఉర్దూ రాదు. ఆ విద్యార్థులకు తెలుగు రాదు. నేను ఇంగ్లీఘలో గణితం చెబుతున్నాను. విద్యార్థులు నన్ను ఉర్దూలో ప్రశ్నలు అడుగుతున్నాను. నాకేమీ అర్థం కావడం లేదు. దయచేసి నన్ను ఈ పాఠశాల నుంచి మార్చండి - ఓ ఉపాధ్యాయుడు, వైఎస్సార్ జిల్లా
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం - 27 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ
విద్యా వాలంటీర్లను నియమించినా సరిపోయేది : ఇటీవల సర్దుబాటు ప్రక్రియలో భాగంగా పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులకు ఉర్దూ రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు ఉర్దూ మినహా ఇతర మాధ్యమాలు అవసరం లేకుండాపోవడంతో విద్యాశాఖ అధికారులపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీని కన్నా విద్యా వాలంటీర్లను ఉర్దూ పాఠశాలకు కేటాయించినా, తాత్కాలికంగా సమస్యల పరిష్కారమయ్యేదని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. వైఎస్‌ఆర్, అన్నమయ్యతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
గత ప్రభుత్వ తీరుతోనే ఈ పరిస్థితి : అన్ని పాఠశాలలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలలుగా మార్పు చేశామంటూ గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం హడావుడి చేసింది. దీంతో ఉన్నత పాఠశాలలకు ఆంగ్ల మాధ్యమ ఉపాధ్యాయులు ఉపయోగపడతారని విద్యాశాఖ అధికారులు భావించారు. ఈ క్రమంలోనే అదనంగా ఉన్న వారిని ఉర్దూ పాఠశాలలకు పంపినట్లుగా అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితి కానరావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
'వీ వాంట్ టీచర్'- బదిలీని రద్దు చేయాలంటూ విద్యార్థులు ధర్నా - Students Protest
ఉర్దూ పాఠశాలకు ఆ భాష తెలియని గణితం, భౌతిక శాస్త్రం ఉపాధ్యాయులు నియమించిన సంఘటనలు వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలో జరిగిన సంఘటనలు :
- అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం తరిగొండ ఉర్దూ పాఠశాలకు ఆ భాష తెలియని గణితం, భౌతిక శాస్త్రం ఉపాధ్యాయులను నియమించారు.
- రాయచోటిలో ఉన్నత పాఠశాలకు గణితం సబ్జెక్టుకు ఇలానే కేటాయించారు.
- వైఎస్సార్ జిల్లా బద్వేలు గోపవరంలోని ఉర్దూ పాఠశాలకు గణితం ఉపాధ్యాయుడిని ఇచ్చారు.
- చింతకొమ్మదిన్నె మండలం మూలవంక, ప్రొద్దుటూరు మోడంపల్లె, కడప సాలెనాగయ్య నగరపాలక ఉర్దూ ఉన్నత పాఠశాలలల్లో గణితానికి ఉర్దూతో సంబంధం లేని సాధారణ ఉపాధ్యాయులను పంపారు.
ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఉర్దూ ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు. ఉపాధ్యాయులు ఆయా పాఠశాలలకు వెళతామని అంగీకరించిన తర్వాతే వారిని పంపించామని వైఎస్సార్ డీఈవో అనూరాధ వెల్లడించారు. ఉర్దూ విద్యార్థులు ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సేవలు వినియోగించుకుంటారన్న ఉద్దేశంతో కేటాయించామని పేర్కొన్నారు.