Engineering Core Branches Poor Admissions at Anantapur JNTU : ఇంజనీరింగ్ కళాశాలల్లో కోర్ విభాగాల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏటికేడు తగ్గిపోతుంది. కంప్యూటర్ ఇంజినీరింగ్ అనుబంధ విభాగాల్లో పెద్దఎత్తున అవకాశాలు వస్తుండటంతో కోర్ ఇంజనీరింగ్‌లో చేరటానికి విద్యార్థులు ఆసక్తి చూపడంలేదు. దీంతో ఏటా ఇంజనీరింగ్ కళాశాలల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో సీట్లు తగ్గించాలని జేఎన్‌టీయూకు అభ్యర్థనలు వస్తున్నాయి. అనంతపురం జేఎన్‌టీయూ పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో కోర్ ఇంజనీరింగ్ విభాగాలు తొలగిస్తామని కళాశాలల యాజమాన్యాలు సంప్రదిస్తున్న పరిస్థితులు భవిష్యత్తు ఇంజనీర్ల కొరతకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్ వేర్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుండటం వల్లనే కోర్ ఇంజనీరింగ్ విద్య చదవటానికి యువత ఆసక్తిగా లేరని స్పష్టమవుతోంది.
30 శాతం సీట్లు కూడా భర్తీ కావడం లేదు : అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, నెల్లూరు ఉమ్మడి జిల్లాల ఇంజినీరింగ్ కళాశాలలన్నీ అనంతపురం జేఎన్‌టీయూ పరిధిలో ఉన్నాయి. ఈ ఐదు ఉమ్మడి జిల్లాల్లో 70 ఇంజినీరింగ్ కళాశాలలుండగా 42 కాలేజీలకు స్వయం ప్రతిపత్తి హోదా ఉంది. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో కనీసం 30 శాతం సీట్లు కూడా భర్తీ కావడంలేదు. నిండిన సీట్లు కూడా అటానమస్ కళాశాల్లోనివే. చాలా ప్రైవేట్ కళాశాల్లో ఈ మూడు విభాగాల్లో సీట్లు తొలగించాలని జేఎన్‌టీయూకు అభ్యర్థనలు వస్తున్నాయి. కోర్ ఇంజినీరింగ్ లేకుండా కళాశాలలకు అనుమతి కొనసాగించడం కుదరదని వర్సిటీ అధికారులు చెబుతున్నారు.
చదువుతో పాటే ఉద్యోగాల వేట - ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటేలా శిక్షణ - Campus Recruitment Training
భారీ ప్యాకేజీలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు : సీఎస్ఈ (CSE) బ్రాంచ్‌లో చేరితే భారీ ప్యాకేజీలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తుందన్న భావన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో బాగా పాతుకుపోయింది. దీంతో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌తోపాటు, అనుబంధ కోర్సుల్లోనే విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు. గతంలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రైవేట్ కళాశాలల్లో 60 నుంచి 100 సీట్లు ఉండగా ప్రస్తుతం చాలా కాలేజీలు ఆయా విభాగాల సీట్లను 30కే పరిమితం చేసుకున్నాయి. విద్యార్థులు చేరకపోవడంతో నిర్వహణ భారంగా మారిందంటూ కళాశాలలు సీట్ల సంఖ్యను సగానికి తగ్గించేస్తున్నాయి.
భవిష్యత్తులో ఇంజినీర్ల కొరత : కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ దూసుకుపోతుండడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు డిమాండ్ తగ్గిందని చాలీచాలని ప్యాకేజీలు ఇస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో కోర్ విభాగం పుంజుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఓవైపు దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టి పెద్దఎత్తున అభివృద్ధి చేస్తుండగా, ఈ అభివృద్ధి అంతా కోర్ ఇంజనీరింగ్ పట్టభద్రుల పర్యవేక్షణలోనే జరగాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియలో పాలుపంచుకోవాల్సిన యువత ఇంజనీరింగ్‌లో ఆయా కోర్సులు చేయటానికి మాత్రం ముందుకు రావడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్ వేర్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుండటం వల్లనే కోర్ ఇంజనీరింగ్ విద్య చదవటానికి యువత ఆసక్తిగా లేరని స్పష్టమవుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రాకపోతే భవిష్యత్తులో ఇంజినీర్ల కొరత తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వైఎస్సార్సీపీకి అడ్డాగా విశ్వవిద్యాలయాలు - కాకినాడ జేఎన్టీయూలో 'జగనన్న కాలేజ్ కెప్టెన్స్'