AP Govt Inquiry on Shanthi Irregularities : గత సర్కార్‌లో అధికారం అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ నాయకులు సాగించిన దందాలు అన్నీఇన్నీ కావు. వారి అండ చూసుకుని అధికారులు కూడా బరితెగించారు. ఉమ్మడి విశాఖ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌గా పనిచేసిన శాంతి వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. తన పరిధి కాకున్నా, తనకు అధికారం లేకున్నా దేవాదాయ ఆస్తులను అడ్డగోలుగా అప్పగించేశారు. అనకాపల్లి జిల్లాలోని పలు దేవాలయాలకు సంబంధించిన దుకాణాలు, భూముల లీజులను నిబంధనలకు విరుద్ధంగా పొడిగించి అవకతవకలకు పాల్పడ్డారు.
Endowment Shanthi Irregularities : నాడు సహాయ కమిషనర్‌గా శాంతి ఏమి చేసినా అడిగేవారే లేరు. వైఎస్సార్సీపీ పెద్దలతో పరిచయాలుండడంతో దేవాదాయ శాఖలో ఆమె చెప్పిందే వేదం అన్నట్లుగా నడిచింది. సర్కార్ మారిన తర్వాత శాంతి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో రెండేళ్లకు పైగా సహాయ కమిషనర్‌గా పని చేశారు. ఆ సమయంలో జరిగిన వ్యవహారాలపై ప్రభుత్వం విచారణ చేపట్టగా పలు ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.
ఔరా ఇది చూశారా :
- అనకాపల్లి సిద్ధి లింగేశ్వరస్వామి దేవాలయానికి ప్రధాన రోడ్డుకు ఆనుకొని 14 దుకాణాల వాణిజ్య సముదాయం ఉంది. వీటిలో ఎనిమిది దుకాణాలకు 2022లో లీజు ముగిసింది. వీరికే ఇవ్వాలంటే 50 శాతం అద్దె పెంచి ఉన్నతాధికారుల అనుమతితో ఇవ్వొచ్చు. అయితే ఈ ఆలయం డిప్యూటి కమిషనర్ పరిధిలో ఉంది. లీజు ప్రతిపాదన పంపాలంటే ఆ స్థాయి అధికారే పంపాలి. జిల్లా అధికారికి అధికారం లేదు. కానీ నిబంధనలకు వ్యతిరేకంగా జిల్లా అధికారి హోదాలోనే శాంతి లీజు ప్రతిపాదనలు పంపి ఉన్నతాధికారుల నుంచి ఆమోదం తీసుకున్నారు.
- ధారమఠం ధారమల్లేశ్వర స్వామి, కల్యాణలోవ కల్యాణపోతురాజు ఆలయాలకు ఒక్కరే ఈవో, ఒక్కరే ఇన్‌స్పెక్టర్. శివరాత్రి జాతర తర్వాత హుండీ లెక్కంపు చేపట్టాలి. రెండు దేవాలయాలకు ఒకేసారి హుండీ లెక్కింపు చేపట్టారు. కల్యాణపులోవ హుండీ లెక్కింపులో ఈవో, ఇన్‌స్పెక్టరు పాల్గొన్నారు. ఆ తర్వాత ధారమల్లేశ్వర ఆలయ హుండీ లెక్కింపు చేపట్టాలని భావించారు.
- అయితే ఆదే రోజు విశాఖలోని ఇన్‌స్పెక్టరుగా పనిచేస్తున్న వివాదాస్పద అధికారి శ్రీనివాసరాజును పంపించి ధారమల్లేశ్వర ఆలయం హుండీ లెక్కించారు. హుండీ లెక్కింపు రిజిస్టర్‌లో మాత్రం రెండు చోట్ల ఈవో పాల్గొన్నట్లు సంతకాలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. హుండీ రికార్డులు, నగదులు నర్సీపట్నం తీసుకువెళ్లి అక్కడ సంతకాలు ఫోర్జరీ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి.
బహిరంగ వేలం లేకుండానే :
- చోడవరం విఘేశ్వర దేవాలయం ప్రాంతీయ సంయుక్త కమిషనర్ పరిధిలో ఉంది. అక్కడ ఆస్తులు లీజులకు ఇవ్వాలన్నా, అద్దెలు పెంచాలన్నా ఆ అధికారే ప్రతిపాదనలు చేయాలి. కానీ అక్కడి వ్యవహారాలన్నీ సహాయ కమిషనరే నడిపించారు. ఈ ఆలయ పరిధిలోని ఓ దుకాణాన్ని 15 శాతం అద్దె పెంపుతో 11 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. మరో నాలుగు దుకాణాలకు 30 శాతం, మరో రెండు దుకాణాలకు 15 శాతం స్వల్ప పెంపుతో లీజులను 11 సంవత్సరాలకు పొడిగించేశారు.
- ఇవన్నీ స్థానిక ఈవో ఒక్కరోజులోనే మార్కెట్‌లో అద్దెల వివరాలు పరిశీలించకుండా రేట్లు నిర్ణయించేశారు. దీనివల్ల దేవాదాయ శాఖ భారీగా ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. వాస్తవానికి లీజులు పెంచాలంటే ముందుగా కమిషనర్ అనుమతి తీసుకుని బహిరంగ వేలం ద్వారా ప్రక్రియ చేపట్టాలి. అవేవీ లేకుండానే నామమాత్రంగా దస్త్రాలు నడిపి ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి ఆమోద ముద్ర వేయించుకున్నారు.
- పాయకరావుపేట పాండురంగస్వామి ఆలయానికి 14 దుకాణాలు ఉన్నాయి. ఈ దేవాలయం డిప్యూటీ కమిషనర్ పరిధిలో ఉంది. ఇక్కడ దుకాణాలు లీజులు పొడిగించాలంటే ఆ అధికారి ప్రతిపాదించాలి. వారికి తెలియకుండానే ఈ గుడి దకాణాల లీజులను మూడు సంవత్సరాలు పొడిగించేశారు. కనీసం పత్రికల్లో ప్రకటనలు లేకుండా, వేలం లేకుండా గోప్యంగానే కట్టబెట్టేశారు.
- లంకెలపాలెం పరదేశమ్మ గుడికి 10.83 ఎకరాల భూమి ఉంది. దీనిలో ఒక ఎకరాన్ని నెలకు రూ.20,000ల చొప్పున 11 సంవత్సరాలకు లీజుకిచ్చారు. దీన్ని లీజుదారుడు నెలకు రూ.2 లక్షలకు సబ్‌లీజుకు ఇచ్చి భారీగా ఆదాయం గడిస్తున్నాడు. సదరు లీజుదారుడిని సింహాచలం దేవస్థానం పాలకమండలి సభ్యుడిగానూ నియమించారు. అయితే దేవాదాయ ఆస్తులను కలిగినవారిని పాలకమండలిలో తీసుకోకూడదన్న నిబంధన ఉంది. అయినా దీనిని పట్టించుకోలేదు.
శాంతీ.. నీ భర్త ఎవరు? దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌కు నోటీసులు - ENDOWMENT AC SHANTHI CONTROVERSY