Electricity Employees Struggle Committee Protest: ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) మోహన్ రెడ్డి విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను (Contract Electricity Employees) క్రమబద్ధీకరిస్తానని ఇచ్చిన హామీని అమలు చేయాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ (Electricity Trade Union) ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్ట్రగుల్ కమిటీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు రెండు రకాల వేతనాల పద్ధతికి స్వస్తి పలకాలని కోరారు.
సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. వేతన బకాయిలను చెల్లించాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అందరికీ అమలు చేసి పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఇప్పటికే ఇండస్ట్రీ వన్ సర్వీస్ రెగ్యులేషన్ డిమాండ్లతో అనేకసార్లు యాజమాన్యానికి విన్నవించినా స్పందన కరువైందన్నారు. ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు ఆందోళనలకు సిద్ధమవుతామన్నారు.
Electricity Employees Demands: 'విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి'
"రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత అనేక సంవత్సరాలుగా వీరంతా తక్కువ జీతానికి పని చేస్తున్నారు. వీరందరనీ రెగ్యులరైజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలో జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తైనా ఇప్పటి వరకూ పర్మినెంట్ చేయలేదు.
ఎన్నికలు వచ్చే లోపు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను అక్కడ ప్రభుత్వం పర్మినెంట్ చేసింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో చేయమంటే అనేక చట్టాలు చెబుతున్నారు. అప్పుడు మరి పాదయాత్ర సమయంలో ఇవన్నీ తెలియలేదా అని ప్రశ్నిస్తున్నాం. ఇచ్చిన హామీ ప్రకారం ఏది ఏమైనా సరే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి". - సుబ్బిరెడ్డి, విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
"కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసి వారికి నేరుగా జీతాలు చెల్లించాలి. అదే విధంగా రెండు రకాలు జీతాల పద్ధతులను రద్దు చేయాలి. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న వారి అందరికీ ఒకే విధంగా జీతం చెల్లించాలి. ఈ రోజు మేము ధర్నాలు చేస్తుంటే నిర్భంధాలతో కార్మికులను అణగదొక్కుతున్నారు. సమస్యలను పరిష్కరించకుండా ఇలా చేయడం మంచిది కాదు. సుప్రీం తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం". - సుదర్శన్ రెడ్డి, విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు