EC Issued Summons to AP Chief Secretary and DGP: పల్నాడు, చంద్రగిరి సహా పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు ఈసీ (Election Commission) సమన్లు జారీ చేసింది. పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సీఎస్, డీజీపీని ఆదేశించింది. హింసాత్మక ఘటనలు జరుగుతాయని ముందే హెచ్చరికలు ఉన్నా పోలింగ్ రోజు అంత నిర్లిక్ష్యంగా ఎందుకు వ్యవహరించారని ఈసీ ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈమేరకు ఇద్దరు అధికారులు దిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇవ్వనున్నారు. పలనాడులో స్వయంగా పర్యటించిన ఏపీ ప్రత్యేక అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా ఈ అంశాలను నేరుగా సీఈసీకి నివేదించారు.
సచివాలయంలో అత్యవసర భేటీ: సచివాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్త, ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ సీఎస్ జవహర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ కావటంతో అధికారులు అత్యవసరంగా భేటీ అయ్యారు. రేపు ఈసీ వద్ద వివరణ ఇచ్చేందుకు సీఎస్, డీజీపీలు దిల్లీ వెళ్లనున్నారు. ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరిగేలా పాలనా వ్యవస్థ విఫలం కావడానికి కారణాలేమిటని దీనీకి బాధ్యులు ఎవరని సీఎస్, డీజీపీలను ఈసీ ప్రశ్నించింది. హింసాత్మక ఘటనల తర్వాత నివారణా చర్యలు ఏం తీసుకున్నారంటూ అధికారులకు ప్రశ్నించింది. ఈ అంశాలపై డీజీపీ, సీఎస్, ఇంటెలిజెన్స్ ఏడీజీలు అత్యవసరంగా భేటీ అయ్యారు.
Tirupati: తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయం ఆవరణలో వైసీపీ నాయకులు మారణాయుధాలతో రెచ్చిపోయారు. ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్‌లను పరిశీలించేందుకు వచ్చిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారు. చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆయన కుమారుడు, ప్రస్తుతం పార్టీ అభ్యర్థి మోహిత్‌రెడ్డి అనుచరులు సమ్మెట, కర్రలు, రాళ్లు, బీరు సీసాలతో దాడులు చేస్తూ వీరంగం సృష్టించారు. నానితోపాటు ఆయన డ్రైవర్, గన్‌మెన్లపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.
Karempudi: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో విధ్వంసం సృష్టించారు. తన కారుపై ఎవరో రాయి వేశారనే నెపంతో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కారంపూడి మీదుగా వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌లోని ఓ కారుపై గుర్తుతెలియని వ్యక్తి రాయి విసిరాడనే నెపంతో ఆగ్రహంతో ఊగిపోయారు. కార్లలో ఉన్న వైసీపీ గూండాలు కర్రలు, కత్తులు, రాడ్లు బయటకు తీసి టీడీపీ కార్యాలయంలోకి దూసుకెళ్లి సామగ్రిని ధ్వంసం చేశారు. దుకాణదారులపైనా వైసీపీ మూకలు దాడులకు తెగబడ్డారు.
Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎన్నికల ముందు అన్నట్లుగానే విధ్వంసకాండను సృష్టించారు. తాడిపత్రిని యుద్ధభూమిగా మార్చారు. తాడిపత్రిలోని చింతలరాయుని పాళెంలో ఉన్న వైసీపీ ఏజెంట్లు టీడీపీ ఏజెంట్లపై దాడికి దిగారు. అంతలో టీడీపీ నాయకుడు సూర్యముని అనుచరులు వైసీపీ ఏజెంట్ సంజీవను నిలదీయగా అతను ఎమ్మెల్యే పెద్దారెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. ఎమ్మెల్యే తన అనుచరులతో సూర్యముని ఇంటి వద్దకు వెళ్లి రాళ్లదాడికి దిగారు. ఆ తరువాత ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోకి చేరుకోగా, అక్కడ దాడికి పక్కా వ్యూహంతో ఉన్న వైసీపీ వర్గీయులు ట్రాక్టర్లతో రాళ్లను తెప్పించుకుని టీడీపీ వారిపైకి విసిరారు. టీడీపీ వర్గీయులపై బాణసంచా పేల్చారు. కేంద్ర బలగాలు రంగ ప్రవేశం చేసి అల్లరి మూకలను చెదరగొట్టాయి.