District Science Centre for students in Mancherial : విద్యార్థుల్లో అభ్యాసన అంశాలను మరింత పెంపొందించేలా మంచిర్యాల విద్యాశాఖ అధికారులు విజ్ఞాన శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. జిల్లా సైన్స్ కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు, వారి ఆలోచనలను, సృజనాత్మకతను వెలికితీసేలా 15 రోజులపాటు శిక్షణ అందిస్తున్నారు. 300 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా సుమారు 100 మంది విద్యార్థులకు సౌకర్యాలకు అనుకూలంగా అవకాశం కల్పించామని జిల్లా సైన్స్ అధికారి మధుబాబు తెలిపారు.
నాలుగేళ్ల నుంచి వేసవిలో విద్యార్థుల నైపుణ్యాన్ని మరింత తీర్చిదిద్దేందుకు విజ్ఞాన శాస్త్ర విషయాలతోపాటు సామాజిక పర్యావరణ అంశాలను ప్రయోగాత్మకంగా అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నామని సైన్స్ అధికారి తెలిపారు. విద్యార్థులకు ఆసక్తి కలిగేలా వినూత్నంగా రోజుకొక అంశంపై బోధనలు చేపడుతున్నారు అధికారులు. భౌతిక, రసాయన శాస్త్రాలు, బయో సైన్స్, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయాలు వివిధ ప్రయోగాల ద్వారా సులభతరంగా అర్థమయ్యే విధంగా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.
'పిల్లలకు ప్రయోగ నైపుణ్యాలు పెంపొదించాలనే ఉద్దేశంతో విభిన్నమైన కార్యక్రమాలు చేపట్టాం. పాఠశాల స్థాయిలో 9వ తరగతి నుంచి 10 తరగతి తర్వాత ఉన్న ప్రతి అంశాన్ని కూడా ప్రయోగాత్మకంగా పిల్లలు చేసే విధంగా శిక్షణ ఇస్తున్నాం. ఆ ప్రయోగ నైపుణ్యాలతోపాటుగా పాఠశాల స్థాయికి మించి వాళ్లకు రోబోటిక్స్, సెన్సార్గానీ కోడింగ్పైన కూడా శిక్షణ ఇస్తున్నాం'- మధుబాబు, జిల్లా సైన్స్ అధికారి
Summer Camps on Education for Students : విద్యార్థుల మేధోశక్తిని పరీక్షిస్తూ వారి ఆలోచనలను ప్రోత్సహించేందుకు విజ్ఞాన మేళాలకు తీసుకెళ్తూ వాటి సద్వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. సైన్స్ సెంటర్లో పుస్తకాల్లో ఉన్న విషయాలతోపాటు సమాజంలోని పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారని, భవిష్యత్తులో విజ్ఞాన శిబిరం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు చెబుతున్నారు.
వేసవి సెలవుల్లో విద్యార్థులు వినోదాలు, విలాసాలకు అలవాటు పడకుండా వారిలో దాగున్న ప్రతిభను వెలికి తీయడమే వేసవి విజ్ఞాన శిబిరం ముఖ్యొద్దేశమని అధికారులు చెబుతున్నారు. అదే స్ఫూర్తితో విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని జిల్లా సైన్స్ అధికారి మధుబాబు తెలిపారు. మరిన్ని సౌకర్యాలు అందిస్తే వచ్చే వేసవిలో ఆసక్తిగల విద్యార్థులకు ఎక్కువమందికి అభ్యసిస్తామని అన్నారు.
'ఈ సైన్స్ సెంటర్కు వచ్చినప్పటి నుంచి మా చేత ప్రాక్టీకల్స్ చేయిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. మాకు ఇక్కడ రోబోటిక్స్ క్లాసులు చెప్పారు. అందులో చాలా నేర్పించారు. నాపై చదువులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. స్కూల్లో కూడా ఇలాంటి ల్యాబ్స్ ఉండవు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేం చాలా నేర్చుకుంటున్నాం. కొత్త విషయాలు నేర్పిస్తున్నారు'-విద్యార్థులు
లీడ్ చిల్డ్రన్ లైబ్రరీ పేరిట గ్రంథాలయం - చదువే ఆయుధంగా విద్యార్థులకు తోడ్పడుతున్న జంట