ED has Issued Statement on MVV Organizations Searches : విశాఖ మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ మెడ చుట్టూ ఈడీ (ED) ఉచ్చు బిగుసుకుంటోంది. తాజాగా ఆయన సంస్థల్లో సోదాలు నిర్వహించడంపై ఈడీ ప్రకటన చేసింది. విశాఖ ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈనెల 19న ఐదు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్లు వెల్లడించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ఉల్లంఘనలపై సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.
ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుతో కలిసి, గద్దె బ్రహ్మాజీ తప్పుడు పత్రాలను సృష్టించి బినామీ లావాదేవీలను జరిపినట్టు నిర్ధారించింది. ఎండాడలోని హయగ్రీవ డెవలపర్స్కి 2008లో ప్రభుత్వం వృద్దులు, అనాథల కోసం గృహాల నిర్మాణలకు కేటాయించిన భూమిని ఎంవీవీ సత్యనారాయణ, జి. వెంకటేశ్వరరావులు తప్పుడు పత్రాలను సృష్టించి స్వాధీనం చేసుకుని, వాటిని విక్రయించినట్టు ధృవీకరించింది.
ఆ ఎఫ్‌ఐఆర్ ఆధారంగానే దర్యాప్తు : ఈనెల 19న దాదాపు 24 గంటలపాటు వీరికి సంబంధించిన ఇళ్లు, వ్యాపార సముదాయాలలో ఈడీ నిర్వహించిన సోదాల తర్వాత ఆ వివరాలను తాజాగా వెల్లడించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 యొక్క నిబంధనల ఉల్లంఘనలపై సోదాలు నిర్వహించామని ఈడీ వివరించింది. 12.51 ఎకరాల భూమిని మోసపూరితంగా అమ్మకాలు సాగించారని, ఈ భూమి మార్కెట్ విలువు దాదాపు రూ. 200 కోట్లకు ఎక్కవగానే ఉంటుందని తెలిపింది.
దీనిపై ఆరిలోవ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్(FIR) ఆధారంగా దర్యాప్తు, సోదాలను నిర్వహించామంది. గద్దె బ్రహ్మాజీ, గన్నమనేని వెంకటేశ్వరరావు, ఎంవీవీ సత్యనారాయణలు ఫోర్జరీ సంతకాలు, ఫ్యాబ్రికేటింగ్ విక్రయానికి పాల్పడ్డారని నిర్ధారించింది.
ఎంవీవీ ఇళ్లు, కార్యాలయాల్లో ముగిసిన ఈడీ సోదాలు - హయగ్రీవ ల్యాండ్స్ 'సంతకాల ఫోర్జరీ'పై ఆరా
భూమిని లాక్కోవడానికి ఈ-ఫోర్జరీ పత్రాలు : ప్రభుత్వం కేటాయించిన 12.51 ఎకరాల భూమిని లాక్కోవడానికి ఈఫోర్జరీ పత్రాలు సృష్టించారని, ఎండాడ ప్రాంతంలో ఉన్న ఈ 12.51 ఎకరాల భూమిని, రాష్ట్ర ప్రభుత్వం 2008లో M/s హయగ్రీవ ఫామ్స్, డెవలపర్ల సంస్దకు వృద్ధులు, అనాథల కోసం కాటేజీల నిర్మాణానికి ఈ భూమి కేటాయించిందని తెలిపింది.
M/s హయగ్రీవ ఫార్మ్స్ పేరు మీద భూమి రిజిస్టర్ అయిందని, 2010 లో డెవలపర్లు రూ.5.63 కోట్లు చెల్లింపులు చేశారని వివరించింది. రిజీస్ట్రేషన్ రికార్డుల ప్రకారమే, కన్వేయన్స్ డీడ్ నాటికి అనాడే ఆ ఆస్తి మార్కెట్ విలువ సుమారు రూ. 30.25 కోట్లుగా ఉన్నట్టు గుర్తించింది. ఈ భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా స్వాధీనం చేసుకుని, చిన్న ప్లాట్లుగా విభజించారని, 2021 నుంచి వివిధ వ్యక్తులకు విక్రయాలు చేశారని ఈడీ వెల్లడించింది.
పలు కీలక పత్రాలు స్వాధీనం : సేల్ డీడ్‌లు, ఒప్పందాల ద్వారా రూ.150 కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్నే నేరపూరితంగా ఆర్జించినట్టు తెలిపింది. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలలో బినామీ పట్టాదారుపాసుపుస్తకాలు తయారు చేసే డిజిటల్ పరికరాలను గుర్తించామని, వాటికి సంబంధించిన వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నామని ఈడీ వెల్లడించింది. 300 కంటే ఎక్కువ సేల్ డీడ్‌లు స్ధిరాస్ధి పత్రాలను గన్నమనేని వెంకటేశ్వరరావు, ఎంవీవీ సత్యనారాయణ వారి కుటుంబ సభ్యుల పేరుమీద గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు వివరించింది. స్ధిరాస్ధులకు సంబందించి రూ.50 కోట్ల వరకు నగదు లావాదేవీలు జరిగిందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ విశాఖ సబ్ జోనల్ కార్యాలయం అధికారులు వెల్లడించారు.