EC notice issued to Minister Jogi Ramesh: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై చేసిన అభ్యంతర కరమైన వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుపై చేసిన అభ్యంతరకర, అసభ్యకరమైన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలంటూ ఈ నోటీసులు ఇచ్చింది. ఇంటింటి ప్రచారంలో భాగంగా జోగి రమేష్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా టీడీపీ నేతలు వీడియో ఆధారాలు సమర్పించారని సీఈఓ కార్యాలయం పేర్కోంది.
వర్ల రామయ్య పిర్యాదుపై స్పందించిన ఈసీ: తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య పిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వైసీపీ నేతలు జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి లకు నోటీసులు జారీ చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జోగి రమేష్ చంద్రబాబే కోర్టులో పిటిషన్ వేసి పింఛన్లు ఆపారంటూ అసత్య, తప్పుడు ప్రచారం చేస్తున్నాడని వర్ల రామయ్య పిర్యాదుపై ఈసీ స్పందించింది. చంద్రబాబు వల్లే పింఛన్లు ఆగాయంటూ ప్రచారం చేయాలని వాలంటీర్లకు జోగి రమేష్ చెబుతున్న వీడియోను ఎన్నికల సంఘానికి వర్ల పంపిన వీడియోను ఆధారంగా చేసుకుని జోగి రమేష్ కు నోటీసులు జారీ చేసింది.
వైసీపీ నేత అప్పిరెడ్డికి ఈసీ నోటీసులు: పేదలకు అందుతున్న మంచిని నిలిపేశారని, వాలంటీర్ల సేవల నిలిపివేతతో పేదోడి నోటికూడు లాగేశారని చంద్రబాబు పై దుష్ప్రచారం చేస్తూ వైసీపీ అధికారిక ట్విట్టర్‌లో చేసిన ఫోస్ట్ పై ఈ నెల 1న వర్ల రామయ్య ఈసీకి పిర్యాదు చేసారు. వైసీపీ అధికారిక ట్విట్టర్‌లో దురుద్దేశంతో చంద్రబాబుపై చేసిన పోస్ట్ ఎన్నికల నియమావళికి విరుద్దమని ధృవీకరించిన ఈసీ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డికి నోటీసు జారీ చేసింది. ఎన్నికల నియామావళి ప్రకారం అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయకూడదని, అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పటికే సూచనలు ఇచ్చామని సీఈఓ ఆ నోటీసుల్లో పేర్కోన్నారు. సామాజిక మాధ్యమాల్లో చేసిన దుష్ప్రచారంపైనా సమాధానం ఇవ్వాలని వైసీపీ నేత అప్పిరెడ్డికి ఈసీ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా ఈ వ్యాఖ్యలపై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది. సమాధానం ఇవ్వని పక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని ఈసీ పేర్కొంది.