Electric Power Saving Tips : తెలంగాణ ప్రభుత్వం "గృహజ్యోతి" స్కీమ్ కింద తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ని అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. కొంతమంది ఈ పథకానికి అర్హులైనప్పటికీ విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటుతుండడంతో కరెంట్ బిల్లు చెల్లించక తప్పట్లేదు. అలాంటి వారు విద్యుత్ వినియోగంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. కరెంట్ బిల్లు 200 యూనిట్లు దాటకుండా.. జీరో బిల్లు పరిధిలోనే ఉండేలా చూసుకోవచ్చంటున్నారు నిపుణులు. అంతేకాదు.. త్వరలో 300 యూనిట్లు దాటే వినియోగదారులకు బిల్లుల మోత మోగే అవకాశం ఉందట. ఈఆర్సీలు కూడా ప్రభుత్వానికి ఈ మేరకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఇంతకీ.. విద్యుత్ ఆదాకు తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- చాలా మంది ఇళ్లలో ఫిలమెంట్ బల్బులు వాడుతుంటారు. కానీ.. వాటికి బదులు ఎల్‌ఈడీవి యూజ్ చేయడం బెటర్. ఎందుకంటే.. ఫిలమెంట్ బల్బులు వాడితే 60 వాట్లు, ఎల్‌ఈడీ లైట్స్ వాడితే కేవలం 9 వాట్ల విద్యుత్తు మాత్రమే ఖర్చవుతోందంటున్నారు నిపుణులు.
- గదుల్లో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్లు, బల్బులు ఆఫ్ చేసుకోవాలి. అలాగే.. రెగ్యులేటర్ యూజ్ చేస్తూ ఫ్యాన్ల వేగం నియంత్రించడంతో పాటు విద్యుత్తును ఆదా చేసుకోవచ్చంటున్నారు.
- కొందరు టీవీలను రిమోట్‌తో ఆఫ్ చేస్తారు. కానీ.. వాటికి విద్యుత్తు సప్లై చేస్తున్న స్విచ్‌ను మాత్రం ఆఫ్ చేయకుండా అలానే వదిలివేస్తారు. విద్యుత్ పొదుపు చేయాలంటే ఇకపై ఇలా చేయడం మానుకోవాలి.
- అదేవిధంగా.. ఇళ్లలో ఐఎస్‌ఐ గుర్తింపు కలిగిన స్టార్ రేటెడ్ విద్యుత్తు పరికరాలు వాడేలా చూసుకోవాలి.
- ప్రస్తుత రోజుల్లో చాలా మంది వాటర్ హీటర్లు, ఎలక్ట్రిక్ పొయ్యిలు, రైస్‌కుక్కర్లు వాడుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఉపకరణాలు వినియోగించే వారు తక్కువ నాణ్యత కలిగినవి వాడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే.. అలాంటి వాటి వల్ల అధికంగా విద్యుత్తు బిల్లులు వచ్చే అవకాశం ఉంది. అలాగే.. వాటి వినియోగం తగ్గించుకోవడం ద్వారా విద్యుత్తు ఆదా చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.
- అదేవిధంగా.. గ్రైండర్ వినియోగిస్తున్నప్పుడు నైలాస్ బెల్టును ఉపయోగించుకుంటే బెటర్. దీంతో యంత్రం మన్నికగా ఉండడంతో పాటు తక్కువ విద్యుత్తును తీసుకుంటుందని సూచిస్తున్నారు.
- ఫ్రిడ్జ్‌లను గాలి, వెలుతురు ఎక్కువగా వచ్చే చోటనే ఉంచాలి. పదేపదే ఫ్రిడ్జ్ డోర్స్ ఓపెన్ చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే.. దీని కారణంగా విద్యుత్తు అధికంగా ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుందంటున్నారు.
- ఇకపోతే.. ఏసీలు వినియోగించేవారు మంచి కంపెనీలకు చెందిన 5 స్టార్ రేటింగ్ కలిగిన ఏసీల వినియోగంతో కొంత మేర విద్యుత్తు ఆదా చేసుకోవచ్చంటున్నారు.
- అలాగే.. ఏసీలు ఆన్ చేసినప్పుడు కిటికీలు, తలుపులు మూసి 10 నిమిషాల పాటు ఫ్యాన్ వేసుకుంటే గది ఉష్ణోగ్రత త్వరగా చల్లబడుతుంది. తర్వాత ఫ్యాన్ ఆఫ్ చేసుకోవాలి. ఏసీలను ఎల్లప్పుడు 25 డిగ్రీల ఉష్ణోగ్రతతో వినియోగించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా కొంత వరకు విద్యుత్ వినియోగాన్ని అడ్డుకోవచ్చంటున్నారు నిపుణులు.
ఇవీ చదవండి :
కేంద్రం స్కీమ్‌తో ఫ్రీ కరెంట్- కొత్త సోలార్ పథకానికి అప్లై చేసుకోండిలా!
మీ ఇంట్లో టీవీ, ఫ్యాన్ వంటివి ఎంత కరెంటు లాగుతున్నాయో తెలుసా? - ఈ పరికరంతో ఇట్టే తెలుసుకోవచ్చు!