Dussehra Navratri Celebrations at Peddamma Thalli Temple : రాష్ట్రంలో బతుకమ్మ, దసరా పండగ సంబురాలు మిన్నంటుకున్నాయి. శక్తి ఆరాధనకు ప్రాధాన్యతమిస్తూ జరుపుకొనే పండగ దసరా. గురువారం నుంచి ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవి నవరాత్రుల నేపథ్యంలో ఆలయాన్ని విద్యుత్ కాంతులతో అలంకరించారు. అలాగే పూలతో సుందరంగా ముస్తాబు చేశారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
తొమ్మిది రోజులు అమ్మవారిని అలంకారాలు :
- బాలాత్రిపుర సుందరీదేవి : తొలిరోజు అమ్మవారు పసుపు రంగు చీరలో బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఎనిమిదేళ్ల లోపు బాలికలకు అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజలు చేశారు. అభయహస్త ముద్రతో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారి అభయహస్త ముద్ర అనుగ్రహం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
- గజలక్ష్మీ దేవి : రెండో రోజు అంటే ఇవాళ అష్టలక్ష్మి రూపాల్లో ఒకటైన గజలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. గజలక్ష్మీదేవి కమలం మీద పద్మాసన భంగిమలో కూర్చొని నాలుగు చేతులు ఉంటాయి. ఓ చేతిలో కమలాలను పట్టుకోగా, వరదముద్ర, అభయహస్తం చేతులు ఉంటాయి. చుట్టూ ఉన్న ఏనుగులు తొండాలతో అమ్మవారిపై నీటిని చల్లుతాయి. శుభాలను కలిగించేందుకు అమ్మవారికి గులాబీ రంగు చీరను అలంకరించారు. అందుకే గులాబీ రంగు ఉన్న చీరలో అమ్మవారు దర్శనమిచ్చారు.
- అన్నపూర్ణాదేవి : ఈనెల 5న శనివారం ఈ అలంకరణలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే దేవతగా అన్నపూర్ణాదేవిగా చెప్పుకుంటారు. ఈ అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ఐశ్వర్య సిద్ది, ధనధాన్యవృద్ధి కలుగుతాయని ప్రతీతి. అమ్మవారిలో చేతిలో వెండిగిన్నెతో పూల అలంకారంతో నిర్మలమైన, చల్లని మనసుకు ప్రతీకగా అమ్మవారు నిలుస్తున్నారు.
- గాయత్రీదేవి : ఈనెల 6వ తేదీన అనగా ఆదివారం రోజున శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్దమ్మ తల్లి గాయత్రీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. నారింజ(ఆరెంజ్) రంగు చీరతో భక్తులకు దర్శనమిస్తారు. పంచముఖాలతో దర్శనమిచ్చే గాయత్రీదేవి అన్ని మంత్రాలకు మూలశక్తిగా భావిస్తారు. ముక్త, విద్రుమ, హేమ, నీల, దవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో శంకు, చక్రం, గద, అంకుశం ధరించి అమ్మవారు నిండైన రూపంలో భక్తులకు దర్శనమిస్తారు.