Drinking Water Problem in Medikonduru: ఓ వైపు మాడు పగిలేలా సూరీడు చిర్రెత్తిస్తుంటే మరోవైపు చెరువులు ఎండి గుక్కెడు నీరు దొరక్క జనం అల్లాడుతున్నారు. మిగతా అవసరాల సంగతి పక్కన పెడితే కనీసం గొంతు తడుపుకునేందుకు కూడా నీరు లేదు. నీరో రామచంద్రా అని గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం, అధికారులు వారి మొర ఆలకించడం లేదు. ఆర్థికంగా భారమైనా చాలా మంది ట్యాంకర్లు, డ్రమ్ములతో నీటిని కొనుక్కుని వాడుకుంటున్నారు. దాతలు నాలుగు రోజులకు ఒకసారి సరఫరా చేసిన నీటినే బంగారంలా దాచి పెట్టుకుంటున్నారు. తీవ్ర నీటి ఎద్దడితో గుంటూరు జిల్లా మేడికొండూరులో ఎటుచూసినా దాహం కేకలే వినిపిస్తున్నాయి. అసలే ఎండలు పెరిగి ప్రజలు వేడిమికి ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరోవైపు కొన్ని ప్రాంతాలలో తాగునీరు లేక అల్లాడిపోతున్నారు.
'దాహమో రామచంద్రా' అంటున్న సీఎం సొంత జిల్లా వాసులు- దశాబ్ద కాలంగా చూడని నీటి కష్టాలు
గుంటూరు జిల్లాలో దాహం కేకలు: గుంటూరు జిల్లా మేడికొండూరు ప్రజల దాహార్తిని తీర్చే చెరువుల్లో చుక్క నీరు లేక వేసవి ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. తాగునీటి సమస్యపై కనీస అవగాహన లేని వైసీపీ ప్రభుత్వం వల్ల అనేక గ్రామాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. సాగర్ కాలువ నుంచి నీరు విడుదల చేసి చెరువులను నింపాల్సిన ప్రభుత్వం ఆ పని చేయడంలో పూర్తిగా విఫలమైంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పటికే చెరువులు ఎండిపోయాయి. అయినా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించకపోవడంతో ఎన్నడూ లేని విధంగా నీటి కష్టాలు రెట్టింపయ్యాయి. మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల పరిధిలోని 20 గ్రామాల ప్రజలు నీటి కోసం కటకటలాడుతున్నారు.
గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న కడప నగర వాసులు - సమస్యను పరిష్కరించాలంటూ ఆందోళన
ఇప్పుడున్న నీటి ఎద్దడి పరిస్థితి తొమ్మిది సంవత్సరాల క్రితం ఉండేది. రెండు నెలల నుంచి నీరు సరిగ్గా ఉండట్లేదు. వారానికి ఒకసారి మాత్రమే ట్యాంకర్లు వస్తున్నాయి. ఒక డ్రమ్ము నీరు వంద రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ట్యాంకర్ నీటిని 1200 రూపాయలు ఇచ్చి కూలీ పని చేసుకొనే వాళ్లం ఏలా కొనగలుగుతాం. - గ్రామస్థులు
నీటి ఎద్దడితో అల్లాడుతున్న ప్రజలు: వేసవి దెబ్బకు నీటి వనరులు, భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి ఎద్దడి తారస్థాయికి చేరుకుంది. కొర్రపాడు, పాలడుగు, వెలవర్తిపాడు, పొట్లపాడు, మంగళగిరిపాడు, మేడికొండూరు, డోకిపర్రు, విశదల, పేరేచర్ల, గుండ్లపాలెం, జంగంగుంట్లపాలెం వాసులకు నీటి ఇక్కట్లు తప్పడం లేదు. దాతలు ట్యాంకర్ల ద్వారా ఇస్తున్న నీటినే పొదుపుగా వాడుకుంటున్నారు. అవీ సరిపోక అదనంగా డబ్బులు చెల్లించి నీటిని కొనుక్కుని అవసరాలు తీర్చుకుంటున్నారు.
రెండు నెలలుగా నీరు సరఫరా చేయకపోవడంతో చంద్రబాబు కాలనీ, ఇందిరా కాలనీ, ఏరుకుల కాలనీ వాసులు ట్యాంకర్ల కోసం ఇళ్ల ముందు పడిగాపులు కాస్తున్నారు. దాతలు సరఫరా చేస్తున్న నీరు సగం మందికి కూడా అందడం లేదు. తాగునీరు లేకు అల్లాడుతున్నా అధికారులు కనీసం పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.