Dog Attacks in Nizamabad : ఉమ్మడి ఇందూర్ జిల్లాలో కుక్కల బెడద పెరిగిపోయింది. ప్రధాన రహదారులు, వీధులు, ఇళ్ల వద్ద గుంపులుగా తిరుగుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పదుల సంఖ్యలో తిరిగే కుక్కలను చూసి ప్రజలను భయపడి పోతున్నారు. రెండు రోజుల కింద కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చాపేటలో ఇంటి బయట అరుగుపై కూర్చున్న రామవ్వ అనే వృద్ధురాలిపై వీధి కుక్కలు గుంపులుగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. నాలుగు గంటల పాటు చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి చెందింది.
గతేడాది జూలై నుంచి డిసెంబర్‌లో 400 మందికి పైగా కుక్కలు గాయపర్చాయి. ఈ ఏడాది జనవరి నెలలో 42 మంది కుక్కల బారిన (Dogs Attack) పడి గాయలపాలయ్యారు. నెల రోజుల్లోనే 40 మందికి పైగా కుక్క కాట్లకు గురయ్యారు. ఇటీవల మాక్లూర్‌లో ఓ బాలుడు కుక్కల దాడిలో మరణించాడు. ఇలా రోజూ కుక్కల బారిన పడి చాలా మంది తీవ్రంగా గాయపడుతున్నారు. కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
Stray Dogs Attack in Telangana : తెలంగాణలో డాగ్ టెర్రర్.. వీధికుక్కల దాడిలో చిన్నారులకు గాయాలు
Nizamabad Stray Dog Attacks : జిల్లాలో కుక్కల నియంత్రణకు అధికారులు సరైన చర్యలు చేపట్టడం లేదు. నిత్యం క్కుకకాటు ప్రమాదాలు పెరుగుతున్నా, యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. గతంలో కుక్కలను పట్టుకోవడానికి ప్రత్యేక సిబ్బందిని రప్పించేవారు. ఇప్పుడా చర్యలు కనిపించడం లేదు. కామారెడ్డిలోని రామేశ్వర్‌పల్లి వద్ద శునకాల నియంత్రణ కేంద్రం ఏర్పాటు చేసినా వైద్యులను నియమించకపోవడంతో నిరుపయోగంగా మారింది. కుక్కలు దాడికి కామారెడ్డి ఆసుపత్రిలో వైద్యం అందించలేకపోతున్నారు. దీంతో నిజామాబాద్‌కు రిఫర్ చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో బాధితుల పరిస్థితి విషమంగా మారుతోంది.
"వీధి కుక్కలు చాలా ఉన్నాయి. పెంచుకున్న కుక్కలను కూడా రోడ్లపై వదిలేస్తున్నారు. దీనికి పరిష్కారం మున్సిపాలిటీ వాళ్లు చూపిస్తారా లేక పోలీసులు చూపిస్తారా? చాలా రోజుల నుంచి ఇక్కడ కుక్కలు తిరుగుతున్నాయి. చిన్నపిల్లలు బయటకు వస్తే వారిపై దాడి చేస్తున్నాయి. రాత్రిళ్లు అరుస్తున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఒకేసారి 4, 5 కుక్కలు దాడి చేస్తున్నాయి. మా బిల్డింగ్‌లోనే ఒక అబ్బాయిని కరిచాయి. ఓ పాపను కూడా కరిచింది. నాలుగు కుట్లు పడ్డాయి. అధికారులు త్వరగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం." - స్థానికులు
గడిచిన నలభై రోజుల్లోనే ఇద్దరు కుక్కల దాడి వల్ల మృత్యువాత పడ్డారు (Dog Attack Deaths). జరుగుతున్న ఘటనల నేపథ్యంలో కఠిన చర్యలు చేపడతామని చెప్పిన ప్రభుత్వం యంత్రాంగం ఆ అంశాన్ని పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని పట్టించుకోకపోతే వీధికుక్కల బారినపడి మరికొంత మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇకనైనా సౌకర్యాలు మెరుగుపర్చాలని, కుక్కల నియంత్రణ కోసం తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Video : బాలికపై వీధికుక్కల దాడి.. ఒకేసారి గుంపుగా వెంటాడి, చుట్టుముట్టి..