Doctors Protest Across the State : కోల్‌కతాలో వైద్యవిద్యార్థినిపై హత్యాచారం ఘటనను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తాయి. పల్నాడు జిల్లా గురజాల ప్రభుత్వ డాక్టర్లు ఆసుపత్రి నుంచి బస్ స్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. బాపట్ల, అద్దంకి, చీరాలలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బంది విధులను బహిష్కరించారు. మంగళగిరి NRIఆసుపత్రి వైద్యులు ర్యాలీ నిర్వహించారు. మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు మానవహారం చేపట్టారు. వారి ఫ్లాష్ మాబ్ అందరిని ఆలోచింపజేసింది. వీరి ఆందోళనకు ఏపీ కౌలు రైతు సంఘం మద్దతు ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా వైద్యుల నిరసన : ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో నిరసన ర్యాలీ జరిగింది. మెడికోలకు న్యాయం చేయాలని, మహిళలపై అత్యాచారాలు అరికట్టాలని గళమెత్తారు. వైద్యవిద్యార్థినిపై జరిగిన హత్యపై న్యాయం చేయాలని నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయంలోని అధికారులకు మహిళా వైద్యులు వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేశారు. గుంటూరులో భారీ నిరసన ప్రదర్శన చేశారు.
'మహిళలకు రక్షణ ఏది ?' - మంగళగిరిలో వైద్య విద్యార్థులు ఫ్లాష్ మాబ్ - Strike on Kolkata Incident
విధులను బహిష్కరించిన వైద్యులు : కోల్‌కతాలో వైద్యవిద్యార్థినిపై జరిగిన పాశవిక ఘటనను వ్యతిరేకిస్తూ ఒంగోలులో రిమ్స్ నుంచి చర్చి సెంటర్ వరకు జూడాలు నిరసన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. నర్సాపురంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అంబాజీపేట ముక్కామల పి.హెచ్.సి వైద్యులు నిరసన ప్రదర్శన చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ప్రభుత్వ వైద్యులు నిరసనగళం వినిపించారు. కాకినాడ జిల్లా తునిలో డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సమాజం తీవ్రంగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందని విశాఖలో పెద్ద ఎత్తున నినదించారు. మహిళా వైద్యులపై అఘాయిత్యాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం, అల్లూరి జిల్లా వైద్యులు విధులను బహిష్కరించి ఆందోళన చేశారు.
వైద్యుల రక్షణకు ప్రత్యేక చట్టం : రాయలసీమ వ్యాప్తంగా వైద్యులు ఆందోళనలతో హోరెత్తించారు. చిత్తూరు జిల్లా నగరి ఏరియా ఆసుపత్రి, పుత్తూరు ఆసుపత్రిలో డాక్టర్లు నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా గోనెగండ్లలో మానవహారంగా ఏర్పడి ఆందోళన చేశారు. వైద్యులపై దాడులను అరికట్టాలంటూ పుట్టపర్తి వైద్యులు ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ధర్మవరంలో నినాదాలతో హోరెత్తించారు. నిందితులను అరెస్టు చేయాలని హిందూపురంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యులకు రక్షణ కల్పించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ అనంతపురం జిల్లా రాయదుర్గంలో డాక్టర్లు ఆందోళన బాటపట్టారు. కడప రిమ్స్ లో జూనియర్ వైద్యుల ఆందోళనకు ఎమ్మెల్యే మాధవీరెడ్డి మద్దతు తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వైద్యులు చేస్తున్న నిరసనలకు విద్యార్థి సంఘాలు, సీపీఐ నాయకులు మద్దతుగా నిలిచారు. విధుల్లో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించాలంటూ రాయచోటిలో ఆర్డీవోకు వైద్యులు వినతిపత్రం అందజేశారు.
తీవ్రంగా ఖండించిన నారా లోకేశ్ : పశ్చిమ బెంగాల్లో వైద్యురాలిపై జరిగిన క్రూరమైన దాడిని మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఆ కుటుంబానికి, ఆమెకు న్యాయం చేయాలని కోరుతున్న వారందరికీ లోకేశ్ సంఘీభావం తెలిపారు. బాధితురాలి పట్ల న్యాయం వేగంగా, నిర్ణయాత్మకంగా, ఆదర్శప్రాయంగా ఉంటుందని ఆకాంక్షించారు.
కోల్‌కతా ఘటన - రాష్ట్రవ్యాప్తంగా వైద్యుల నిరసన - నిలిచిన ఓపీ సేవలు - Strike on Kolkata Incident