Dkz Technologie Fraud Case In Hyderabad : హైదరాబాద్‌లో రూ.లక్ష పెట్టుబడికి రూ.లక్ష లాభం ఇస్తామంటూ వేల మందిని ముంచిన వైనమిది. డీకేజడ్ టెక్నాలజీస్, డికాజో సొల్యూషన్స్ పేర్లతో ప్రజలను మోసం చేశారు. వాటి ఎండీ సయ్యద్ అష్ఫఖ్ రాహిల్, అతడి భార్య డైరెక్టర్ సయీదా అయేషాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితులు 17,500 మందిని రూ.229 కోట్ల మేర మోసగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. నగరానికి చెందిన సయ్యద్ అష్ఫఖ్ రాహిల్ ఎండీగా, అతడి భార్య సయీదా అయేషా, ఇక్బాల్, సయ్యద్ ఉమర్ అహ్మద్, మోయిజ్, అస్లాం, నజీర్, బిలాల్ ఈ సంస్థల్లో డైరెక్టర్లుగా వ్యవహరించేవారు. మాదాపూర్‌లో కార్యాలయం ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం ఓ ప్రకటనలో ఈ వివరాలు తెలిపారు.
పెట్టుబడితో లాభాలంటూ మోసం : కనీసం రూ.5 వేల నుంచి పెట్టుబడులు పెడితే నెలవారీగా లాభాలు ఇస్తామని సామాజిక మాధ్యమాలు, ఇతర వేదికలపై నిందితులు ప్రచారం చేశారు. రూ.లక్ష పెట్టుబడికి మూడు నెలల్లో 15 శాతం, ఆరు నెలల్లో 25 శాతం, సంవత్సరానికి 60 శాతం, రెండేళ్లకు 100 శాతం చొప్పున లాభాలు ఇస్తామని ప్రకటించారు. చాదర్‌ఘాట్, టోలిచౌకీలో అమెజాన్ భాగస్వామ్యంతో స్టోర్లు ఏర్పాటు చేశామని, నిత్యం 4 వేల హెడ్‌ఫోన్లు, బ్యాండ్స్ డెలివరీ చేస్తుంటామని తప్పుడు ప్రచారం చేశారు. గుడి మల్కాపూర్‌కు చెందిన డాక్టర్ అబ్దుల్ జైష్ జనవరిలో రూ.2.74 కోట్లు పెట్టుబడి పెట్టారు. కొన్నాళ్లకు మోసపోయినట్లు గ్రహించారు. హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు.
రూ.1.7 కోట్ల నగదు స్వాధీనం : డీకేజడ్ కార్యాలయాలు, నిందితుల ఇళ్లు, ఫాంహౌస్‌లలో తనిఖీలు చేసి 564 ఒప్పంద బాండ్లు, ఏజెంట్లు, వినియోగదారుల పేర్లున్న దస్త్రాలు, బ్యాంకు చెక్‌బుక్‌లు, 13 ల్యాప్‌టాప్‌లు, రూ.1.7 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏజెంట్లు, ఇతరుల పాత్రపైనా ఆరా తీస్తున్నారు. మిగిలిన నిందితుల్ని త్వరలో అరెస్టు చేస్తామని కమిషనర్ ఆనంద్ తెలిపారు.
లైక్ చేసి, షేర్ చేస్తే డబ్బులు రావు - ఎవరైనా చెబితే నమ్మకండి