DJ Sound Problems: ప్రస్తుతం చాలా వేడుకల్లో మితిమీరిన శబ్దాలతో పెడుతున్న డీజేలు ప్రాణాలు తీస్తున్నాయి. అప్పటివరకు సంతోషంతో డ్యాన్స్ చేస్తున్నవారు ఉన్నట్లుండి కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో వేడుకలు కాస్తా విషాద వేదికలుగా మారుతున్నాయి. శబ్దాల హోరుకు వయసు మళ్లిన వృద్ధులే కాదు యువత సైతం బలవుతున్నారు. కొందరు డీజేల వద్దనే కుప్పకూలుతుంటే, మరికొందరు ఇళ్లకు వెళ్లాక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై నిర్వహించే భారీ ఊరేగింపుల్లో డీజేల వల్ల కుటుంబసభ్యులు, బంధువులు, ఇరుగుపొరుగు వారూ ఆసుపత్రుల పాలవుతున్నారు.
- 'సౌండ్' ఎక్కువైతే నష్టాలే: అధిక సౌండ్ వల్ల హార్ట్ ఎటాక్, బ్రెయిన్‌స్ట్రోక్, వినికిడి శక్తి కోల్పోవడం, చెవిలో శబ్దాలు రావడం, మానసిక ఆందోళన, గుండె దడ, గర్భవిచ్ఛిత్తి, కర్ణభేరి దెబ్బతినడం, బీపీ, ఒత్తిడి, నిద్రలేమి, గర్భంలోని శిశువుకు భవిష్యత్తులో వినికిడి లోపం వంటి సమస్యలు తలెత్తుతాయి.
- వెంటనే ఏం చేయాలంటే?: పెద్ద పెద్ద సౌండ్ల వల్ల అలజడిగా ఉన్న బాధితులను వెంటనే ప్రశాంతంగా ఉన్న గదిలోకి తీసుకెళ్లాలి. గాలి ఆడేలా కూర్చోబెట్టి తాగడానికి నీరందించాలి. దీనివల్ల బాధితులు కొద్దిసేపటికే ఉపశమనం పొందుతారు. భారీ శబ్దాలకు గుండెదడ పెరిగి, తీవ్రంగా చెమటలు పట్టి, కళ్లు తిరిగి ఎవరైనా కిందపడి పోతే వెంటనే వారిని హాస్పిటల్లో చేర్చాలి.
- లిమిట్ దాటితే ప్రమాదమే: సాధారణంగా 70 డెసిబుల్స్ శబ్దాలను వినేందుకు చెవులు సహకరిస్తాయి. 70 నుంచి 85 డెసిబుల్స్ వరకు శబ్దాన్ని ఎనిమిది గంటల పాటు వినొచ్చు. 90 డెసిబుల్స్‌కు నాలుగు గంటలే పరిమితి. అంతకంటే ఎక్కువసేపు వింటే చెవుల్లోని సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. తద్వారా శాశ్వత వినికిడి లోపం ఏర్పడవచ్చు. డీజే సౌండ్ 200 డెసిబుల్స్ పైనే ఉంటుంది. ఇవి శరీరంపై అత్యంత ప్రభావం చూపుతాయి.
- రూల్స్ ఏం చెబుతున్నాయి?: రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఊరేగింపులను భారీ సౌండ్లతో నిర్వహించకూడదు. 70 డెసిబుల్స్ స్థాయి వరకే సౌండ్ పెట్టుకోవడానికి మాత్రమే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అంతకంటే మించితే అది చట్టరీత్యా నేరం. అయినా కూడా ఆ రూల్ ఎక్కడా అమలు కావట్లేదు. హాస్పిటల్స్, స్కూల్స్, కోర్టులను సైలెన్స్ జోన్లుగా పరిగణిస్తారు. వీటి పరిధిలో ఎలాంటి సౌండ్లకూ అనుమతి లేదు.
ఎంతోమంది బలయ్యారు:
ఆంధ్రప్రదేశ్‌లోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం బండారులంక గ్రామానికి చెందిన 22 ఏళ్ల వినయ్ దసరా ఊరేగింపులో అధిక సౌండ్ల మధ్య ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఉన్నట్లుండి కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలించేలోపే అతడు మృతి చెందారు.
అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం అర్లికి చెందిన బండారు రాజపాత్రుడు నాగులచవితి రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమాలను చూస్తున్నారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన డీజే సౌండ్‌ని తట్టుకోలేక గుండెపోటుతో అతడు మరణించారు.
విజయనగరం జిల్లా నిజాంపట్నం మండలంలోని కూచినపూడిలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే సౌండ్ కారణంగా ఓ యువకుడు మృతి చెందారు.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఓ పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబసభ్యులంతా సంతోషంగా ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. పెద్ద సౌండ్‌తో పెట్టిన పాటలకు వరుడు గణేశ్(22) డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందాడు.
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం సీతంపేటలో గతేడాది జరిగిన పెళ్లి వేడుకలో రాణి(30) అనే మహిళ సంతోషంగా డ్యాన్స్ చేశారు. ఈక్రమంలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. డీజే సౌండ్ల ధాటికి ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు తెలిపారు.
జనగామ జిల్లాలోని ఓ ఫంక్షన్ హాల్‌లో అందరూ పెళ్లి వేడుకలో సందడిగా ఉన్నారు. ఒక్కసారిగా వరుడి నానమ్మ గుండెపోటుతో కుప్పకూలారు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందారు. ఆ విషయం తెలిసేలోపే పెళ్లి కొడుకు బంధువైన మరో వృద్ధుడూ చనిపోయారు. ఈ మరణాలకు డీజే సౌండ్లే కారణమై ఉండొచ్చని వైద్యులు చెప్పారు.
ఒడిశాలోని మల్కన్‌గిరి పట్టణంలో ఓ ప్రేమజంట పెద్దలను ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారు. వధువు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన నిశ్చితార్థానికి కుటుంబసమేతంగా వరుడు హాజరయ్యారు. ఆ వేడుకలో డీజే కారణంగా యువకుడి తండ్రి అక్కడికక్కడే గుండెపోటుతో మృతి చెందారు. యువకుడి తండ్రి మృతితో పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
'గంగా నది నీరు తాగడానికి పనికిరావు- కేవలం స్నానానికే'
మెదడులోని నరాలు చిట్లి బ్రెయిన్ స్ట్రోక్: అధిక సౌండ్ల వల్ల గుండె కొట్టుకోవడంలో మార్పులు సంభవిస్తాయని కార్డియాలజిస్ట్ డాక్టర్ భూపాల్ తెలిపారు. 80 డెసిబుల్స్ దాటితే తీవ్ర గుండెపై ప్రభావం పడుతుందని, డీజే వంటి భారీ సౌండ్ల వల్ల ఒత్తిడి, బీపీ, గుండె కొట్టుకోవడం అమాంతంగా పెరుగుతాయని అన్నారు. బాధితుల్లో అలజడి, గుండెదడ, తలనొప్పి మొదలవుతాయని పేర్కొన్నారు. రక్తపోటు 200 దాకా పెరిగి మెదడులోని నరాలు చిట్లి బ్రెయిన్ స్ట్రోక్‌తో చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రక్తపోటుతో నరాలు దెబ్బతిని కొందరికి పక్షవాతం రావచ్చని, పుట్టుకతోనే గుండె వ్యాధులు ఉన్నవారు, బైపాస్ సర్జరీ చేయించుకున్న వారు, స్టెంట్‌లు వేయించుకున్న వారికి కార్డియాక్ అరెస్ట్ వస్తుందని వెల్లడించారు. అలాంటివారు చెవుల్లో దూది పెట్టుకోవాలని, సౌండ్ల నుంచి దూరంగా వెళ్లడం, ఇంటి తలుపులు మూయడం ఉత్తమమని సూచించారు. 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు డీజేలు, భారీ సౌండ్లకు దూరంగా ఉంటే మంచిదని డాక్టర్ భూపాల్ తెలిపారు.
అబార్షన్ అయ్యే ప్రమాదం: భారీ సౌండ్లు గర్భిణులపై ప్రభావం చూపుతాయని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయని గైనకాలజిస్ట్ డాక్టర్ నయన తెలిపారు. నాయిస్ పొల్యూషన్ వల్ల అబార్షన్ అయ్యే అవకాశాలూ ఉన్నాయని అన్నారు. 85 డెసిబుల్స్ సౌండ్ మించితే గర్భిణులకు ప్రమాదకరమని, మనకు వినిపించే సౌండ్లన్నీ గర్భంలోని శిశువుకూ వినిపిస్తాయని పేర్కొన్నారు. వాటి వల్ల మనకు గుండె దడ వచ్చినట్లే శిశువుకూ వచ్చే అవకాశం ఉంటుందని, కొన్నిసార్లు నెలలు నిండకముందే కాన్పు అవ్వొచ్చని తెలిపారు. తల్లి అధిక సౌండ్లు వినడం వల్ల పిల్లలు బరువు తక్కువగా పుడతారని, వారికి ఎదుగుదల వంటి సమస్యలు వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయని నయన సూచించారు. గర్భందాల్చిన 4వ నెల నుంచి డీజే సౌండ్లకు దూరంగా ఉండాలని డాక్టర్ నయన వెల్లడించారు.
శాశ్వత వినికిడి లోపం: ఇళ్లలో సాధారణంగా 30 నుంచి 40 డెసిబుల్స్ సౌండ్ ఉంటుంది. బయట 50-60 డెసిబుల్స్ ఉంటుందని ఈఎన్‌టీ సీనియర్ నిపుణులు డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. దీనివల్ల ఎలాంటి నష్టమూ ఉండదని, ట్రాఫిక్ సిగ్నల్స్, కూడళ్ల వద్ద 60 నుంచి 80 డెసిబుల్స్ సౌండ్లు వినిపిస్తాయని అన్నారు. ఇక్కడ ఎక్కువ సమయం గడిపితే క్రమంగా చెవి సమస్యలు వస్తాయని, భవిష్యత్తులో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. డీజేల్లో 200 డెసిబుల్స్‌కు పైగా సౌండ్ ఉంటుందని, చెవుల్లోని కాక్లియర్‌లోని వెంట్రుకలతో ఉండే సున్నితమైన కణాలు దెబ్బతింటాయని, అవి పూర్తిగా దెబ్బతింటే శాశ్వత వినికిడిలోపం వస్తుందని హెచ్చరించారు. పాక్షికంగా దెబ్బతింటే కొద్దిరోజులు వినిపించదని, ఈ సమస్య నుంచి కొంతకాలం తర్వాత కోలుకోవచ్చని అన్నారు. అయితే భారీ సౌండ్ల వల్ల చిన్న పిల్లల చెవుల్లోని పలుచని అంతర పొరలు చిట్లిపోయి వినికిడి లోపం తలెత్తవచ్చని, సాధ్యమైనంత వరకు వారిని భారీ సౌండ్లకు దూరంగా ఉంచాలని డాక్టర్ ప్రభాకర్ సూచించారు.