Legislative Council Meetings on Telangana Thalli Statue : తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై శాసన మండలిలో చర్చ జరిగింది. కాకతీయ తోరణంలో రాచరికపు ఆనవాళ్లు ఏమున్నాయని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. భూమి, నీటిని తల్లితో పోలుస్తాం, అదే స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం సమయంలో ఓ ప్రొఫెసర్ తెలంగాణ తల్లి ప్రతిమను రూపొందించారన్నారు.
Telangana Council Meetings : తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ఓ సామాజికవర్గ దొరసాని గుర్తుకు వస్తుందని ప్రభుత్వ పెద్దలు చెప్పడం సమంజసం కాదని అయన అన్నారు. కాకతీయ తోరణం, తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహం విషయంలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేర్పులు ఉంటాయని మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తామని చెప్పారు.
కాకతీయులు, మొగల్ సామ్రాజ్యంలో మంచి చెడు రెండూ జరిగాయని, చెడు మరోసారి జరగకుండా చూస్తాం అని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar babu) పేర్కొన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా విగ్రహం తయారు చెయ్యదని, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. సింగిల్‌గా నిర్ణయం తీసుకోమని, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నం తయారీలో బీఆర్ఎస్ నేతల సలహాలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.
కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినా - ప్రయోజనాల్లో మాత్రం అదనపు పెరుగుదల లేదు : కాగ్ నివేదిక
కాకతీయ రాజులు తెలంగాణ సమాజానికి ఎంతో మంచి పనులు చేశారు. నిజాం రాజులు హైదరాబాద్ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. గద్దర్ పేరు మీద ఒక జాతీయ స్థాయి అవార్డు ప్రకటించాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గద్దర్‌పై పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని, గద్దర్ స్మారక భవనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
Establishment of Gaddar Museum : గద్దర్ వాడిన వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేయాలన్నారు. రెండుమూడు రోజుల్లో గద్దర్ అవార్డ్ కమిటీపై సమావేశం ఏర్పాటు చేస్తాం అన్నారు. సచివాలయం ముందు ఏర్పాటు చేయాల్సిన తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల తాము అభ్యంతరం, నిరసన వ్యక్తం చేస్తున్నామని ఎమ్మెల్సీ కవిత మండలిలో ప్రకటించారు.
రాజీవ్ గాంధీ పేరును విమానాశ్రయానికి పెట్టాం, దానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి ఈ ప్రభుత్వం మార్పులు చేస్తే ఎవ్వరూ అభ్యంతరం చెప్పడం లేదన్నారు. కానీ తెలంగాణా తల్లి విగ్రహాన్ని గతంలో ఏర్పాటు చేస్తానన్న స్థానంలోనే ఏర్పాటు చేయాలన్నారు. రాజీవ్ గాంధీపై తమకు కూడా గౌరవం ఉందని విగ్రహం ఏర్పాటు కోసం చాలా స్థలాలు ఉన్నాయి. వేరే అనువైన స్థలంలో ఏర్పాటుచేస్తే బాగుంటుందని సూచించారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే గ్రామీణ వాతావరణం ఉట్టి పడాలి, అందుకే రూపు రేఖలు మార్చాలని చూస్తున్నాము అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబం దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిందని, అందుకే వారి విగ్రహాలు పెడుతున్నామన్నారు.
"కాకతీయ తోరణం, తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేర్పులు ఉంటాయి. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తాం. ప్రభుత్వం ఏక పక్షంగా విగ్రహం తయారు చెయ్యద్దని, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుంది". - శ్రీధర్‌బాబు, మంత్రి
డ్రాయింగ్‌లో ఒకలా, కట్టింది మరోలా - 'మేడిగడ్డ' అంతా లోపాలమయం
యువతలో స్ఫూర్తి నింపేందుకే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు : రేవంత్‌రెడ్డి