DIG Koya Praveen Exclusive Interview on Social Media Posts Case : సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి వేధించిన కేసులో సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలను అరెస్ట్ చేస్తామని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు. వర్రా రవీందర్ రెడ్డి విచ్చలవిడిగా షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడం వెనక అవినాష్ రెడ్డి, ఆయన పీఏ రాఘవరెడ్డి ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ఎవరి పాత్ర ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్న డీఐజీ ప్రవీణ్ వెల్లడించారు.
తాడేపల్లి కార్యాలయం నుంచే పోస్టులన్నీ పెట్టారు: డీఐజీ
భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలోనే : తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి అనుచిత పోస్టుల వ్యవహారం నడిపినట్లు కోయ ప్రవీణ్ తెలియజేశారు. ఈ వ్యవహారం అంతా వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమ విభాగం ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలోనే నడిచినట్లు వెల్లడించారు. భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది పనిచేసినట్లు తెలిపారు. 400 హ్యాండిల్స్‌లో 40 వాటిలో బూతు పురాణం ఉందని పేర్కొన్నారు.
సజ్జల భార్గవ్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు - మరో ఇద్దరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు
ఎంపీ అవినాష్‌రెడ్డి సమాచారం ఇస్తేనే పోస్టులు : అధికారపార్టీ నేతలే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా అనుచిత పోస్టులు పెట్టినందుకు వర్రా రవీందర్‌రెడ్డికి తొలుత నెలకు రూ.8 వేలు ఇచ్చేవారని కోయ ప్రవీణ్ తెలియజేశారు. ఎన్నికల సమయంలో అయితే నెలకు వర్రా రవీందర్‌రెడ్డికి రూ.13 వేలు ఇచ్చారని పేర్కొన్నారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి సమాచారం ఇస్తే పోస్టు చేసినట్లు వర్రా విచారణలో పేర్కొన్నారని వివరించారు. ఈ విషయంలో సూత్రధారులను, పాత్రధారులందరినీ అరెస్టు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.