Dialysis Patients Problems in Kanigiri: ప్రకాశం జిల్లా కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలోని డయాలసిస్ కేంద్రంలో డయాలసిస్ రోగుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. డయాలసిస్ కేంద్రంలో 17 డయాలసిస్ యంత్రాలు ఉన్నప్పటికీ నాలుగు మాత్రమే పని చేస్తున్నాయి. 13 యంత్రాలు మరమ్మతులకు గురై మూలకు చేరగా, నాలుగు యంత్రాలపైనే రోగులకు వైద్యం అందిస్తుండటంతో రోగులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ డయాలసిస్ చేయించుకునేందుకు కేంద్రం వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ పరిస్థితిపై డయాలసిస్ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ప్రతి రోగికి నాలుగు గంటల పాటు డయాలసిస్ చేయాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం రెండు గంటలు మాత్రమే చేసి బయటకు పంపిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. కనిగిరి డయాలసిస్ కేంద్రంలో 17 డయాలసిస్ యంత్రాలు ఉన్నాయి. అయితే వాటిని ఏడాదికి ఒక సారి మరమ్మతులు చేయాల్సి ఉండగా, ఏడాది దాటినా ఎలాంటి మరమ్మతులు చేయలేదు. దీంతో అవి ఒక్కొక్కటిగా మరమ్మతులకు గురై ఇప్పటికే 13 డయాలసిస్ మిషన్లు మూలకు చేరాయి.
సమస్యలకు నిలయాలుగా డయాలసిస్ సెంటర్లు!- ఏసీల్లో ఎలుకలు - Problems at Dialysis Centre
ప్రస్తుతం ఉన్న నాలుగు మిషన్లపై డయాలసిస్ సరిగా జరగకపోవడంతో రోగులు ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కు ముంటున్నారు. దీంతో పాటు ప్రతి రోగికి డయాలసిస్ చేసే సమయంలో 7 లీటర్ల నీరు అందించాలి. కానీ డయాలసిస్ కేంద్రంలో ఉన్న ఆర్ఓ ప్లాంటు పని చేయకపోవడంతో ఫ్లోరైడ్ నీటినే డయాలసిస్ యంత్రాలకు ఉపయోగిస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడే యంత్రాలు నిలిచిపోయాయి. నాలుగు యంత్రాలు మాత్రమే పనిచేస్తుండటంతో డయాలసిస్ చేయించుకునేందుకు వచ్చిన రోగులకు ఆలస్యం కావడం చేత కొంతమందికి ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు.
ప్రతి రోజు 50 మంది డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు 4 షిఫ్ట్‌ల ద్వారా చేయాల్సిన డయాలసిస్ నామ్‌కే వాస్తే అన్నట్లుగా తూతూమంత్రంగా డయాలసిస్ చేసి రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే విధంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి తోడు రోగులు విశ్రాంతి తీసుకునే చోట లైట్లు, ఫ్యాన్లు లేక చీకట్లలో తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రతి రోగికి 4 గంటల పాటు, వారానికి రెండు నుంచి నాలుగు సార్లు స్టేజీని బట్టి డయాలసిస్ చేయించుకుంటేనే ఆరోగ్యకరంగా ఉండే వారి పరిస్థితి ఉంది. అయితే రెండు రోజులుగా యంత్రాలు పని చేయకపోవడంతో పాటు డయాలసిస్ సరిగా చేయకపోవడంతో రోగులు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయమై డయాలసిస్ కేంద్రంలోని సిబ్బందిని వివరణ కోరగా అక్కడ సిబ్బంది మాట దాటేస్తూ ఎవరికి వారు తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Dialysis Problems: ఆస్పత్రిలో కరెంట్ కష్టాలు.. కిడ్నీ రోగుల అవస్థలు