Development Works Starts in AP Capital Amaravati : ప్రతిష్టాత్మక సంస్థలు, పేరొందిన శాఖల కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటైనా ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అలాంటి సంస్థలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎర్రతివాచీ పరిచి స్వాగతిస్తాయి. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్న ధోరణి అనుసరించి అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు కాకుండా మోకాలడ్డింది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వివిధ కేంద్ర సంస్థలకు భూములు కేటాయించింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తగిన సహకారం లేక వాటి నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
2025 ఏప్రిల్ నాటికి పనులు పూర్తి : తాజాగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో రాజధానిలో నిర్మాణ పనులకు జీవం వచ్చింది. ఇదే సమయంలో కేంద్ర నిధులతో అమరావతిలో నిర్మిస్తున్న ఫోరెన్సిక్ ల్యాబ్ పనులూ వేగవంతమయ్యాయి. పోలీస్ గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ల్యాబ్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. 2025 ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇబ్బందులు పడిన విద్యార్థులు : కాగ్, ఆర్బీఐ, సీబీఐ, ఎఫ్సీఐ, సీపీడబ్ల్యూడీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, నిఫ్ట్, ఎన్ఐడీ, టూల్ డిజైన్ వంటి సంస్థలకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భూ కేటాయింపులు జరగ్గా ఒక్క ఎన్ఐడీ మాత్రమే పనులు ప్రారంభించింది. మొదటి దశ పనులు పూర్తి చేసుకుని కొద్ది నెలల క్రితం కార్యకలాపాలు కూడా ప్రారంభించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమరావతిలో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో రహదారి సౌకర్యం లేక ఎన్ఐడీ అధికారులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
ఆంధ్రాకు ఆర్థిక ఆయువుపట్టుగా అమరావతి- ప్రజా రాజధానిగా పునరుద్ధరణ - AP Capital Amaravati Development
జాతీయ ఫోరెన్సిక్ ప్రయోగశాల నిర్మాణం : కొత్త ప్రభుత్వం కొలువు దీరగానే రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టింది. నిర్మాణ పనులు చేపట్టేందుకు గుత్తేదారులతో చర్చలు ప్రారంభించింది. రహదారులు ఇతర మౌలిక వసతుల పనులు పట్టాలెక్కితే అమరావతి నిర్మాణం మరింతగా ఊపందుకునే అవకాశాలున్నాయి. పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఇంధన సంస్థలు అమరావతిలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. జాతీయ ఫోరెన్సిక్ ప్రయోగశాల నిర్మాణం ఇప్పుడు వేగంగా జరుగుతుండటాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇదే తరహాలో ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా తమకు కేటాయించిన భూముల్లో పనులు ప్రారంభిస్తే అమరావతిలో కార్యకలాపాలకు ఊతమిచ్చినట్లవుతుందని చెబుతున్నారు.