Pollution in Hyderabad City : వాయు కాలుష్యంలో భాగ్యనగరం దిల్లీ బాటలోనే పయనిస్తోంది. వాయు నాణ్యత రోజురోజుకి క్షీణిస్తోంది. ఆదివారం (నవంబర్ 24)న నమోదైన సూచీ లెక్కల ప్రకారం నగరంలోని నాలుగు ప్రాంతాల్లో వాయునాణ్యత పడిపోయింది. సనత్‌నగర్ ప్రాంతంలో అత్యధికంగా 270 నమోదు అయ్యింది. ఇక్రిశాట్‌లో 166, ఐడీఏ పాశమైలారంలో 162, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) నమోదు కేంద్రం వద్ద 144గా నమోదవడం హైదరాబాద్ వాసులకు ఆందోళన కలిగిస్తోంది.
రానున్న రోజుల్లో చలితీవ్రత మరింత పెరిగే సూచనలు ఉండడంతో కాలుష్యం అంతే స్థాయిలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చలి మంటల కోసం చెత్తను పోగు చేసి తగలబెట్టడం, డంపింగ్ యార్డుల్లో చెత్తను కాల్చకూడదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిర్మాణ రంగంలోనూ కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టేలా నిర్వాహకులు, యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
వాయునాణ్యత క్షీణిస్తూ : వాహనాల రద్దీ, బహిరంగంగా చెత్త కాల్చడం, పారిశ్రామిక కాలుష్యం, అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆర్‌ఎంసీల (రెడీ మిక్స్ కాంక్రీట్)తో నగరంలో వాయునాణ్యత నానాటికీ క్షీణిస్తోంది. ఏడాది కాలంలోనే కలుషిత నగరాల జాబితాలో హైదరాబాద్ చేరిందంటే పరిస్థితి ఎంత అధ్వానంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్ (వాయు నాణ్యత సూచీ) ఆధారంగా రూపొందించిన నివేదిక ప్రకారం కలుషిత నగరాల జాబితాలో హైదరాబాద్ మహా నగరం ఏడో స్థానంలో ఉంది.
ఎక్కడెక్కడ : ఎల్బీనగర్, రాజేంద్రనగర్, గగన్ పహాడ్ ప్రాంతాలతో పాటు బాపూఘాట్ నుంచి పీర్జాదీగూడ వరకు మూసీ తీరం వెంబడి చెత్తను దహనం చేస్తున్నట్లు బల్దియా, పీసీబీకి ఫిర్యాదులు అధిక సంఖ్యలో అందుతున్నాయి.
నిర్మాణ రంగంలో ఆర్‌ఎంసీలు : కాలుష్య ఉద్గారాలకు సంబంధించి ఆర్‌ఎంసీల పై స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పీసీబీ (పోల్యుషన్ కంట్రోల్ బోర్డ్) చర్యలు చేపట్టింది. ఇంజినీరింగ్ సంస్థలకు (నిర్మాణ రంగం) గడువు విధిస్తూ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. ఆర్‌ఎంసీ నిర్వహణలో క్లోజ్డ్ షెడ్‌లు, స్ప్రింక్లర్లు వినియోగించక పోవడంతో దుమ్ము రేగి అతి సూక్ష్మధూళి కణాలు గాలిలో కలిసి కాలుష్య కారకాలుగా మారుతున్నాయి.
ఓవైపు చలి - మరోవైపు కాలుష్యం - హైదరాబాద్‌లో ఆరోగ్యం 'గాలి'లో దీపమేనా?