Theft Case in Uppal : జనగామ జిల్లాకు చెందిన అరవింద్ చంద్ర అనే వ్యక్తి ఉప్పల్‌లోని విజయపురి కాలనీలో ఉంటూ ఇంటర్ చదువుతున్నాడు. బుధవారం (డిసెంబర్ 4) కాలేజీకి వెళ్లి ఆర్టీసీ బస్సులో తిరిగి వస్తున్నాడు. ఉప్పల్ రింగు రోడ్డు సమీపంలోని సబ్‌స్టేషన్ వద్ద ఉన్న స్టాప్ కాకుండా తర్వాత బస్టాప్‌లో దిగేందుకు ఫుట్‌బోర్డు పైకి వచ్చాడు. ఇదే సమయంలో ఓ దొంగ అరవింద్ చంద్ర జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ను కొట్టేసి బస్సు దిగి పారిపోతున్నాడు.
ఇది గమనించిన విద్యార్థి గట్టిగా అరవడంతో అక్కడే ఉన్న వేరే బస్సు కండక్టర్‌గా పని చేస్తున్న రాములు దొంగ వెంట వేగంగా పరుగెత్తాడు. (ఇతను ఉప్పల్ రింగురోడ్డు సబ్‌స్టేషన్ దగ్గర ఉన్న బస్టాప్ వద్ద ప్రయాణికులకు సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.) దొంగ రాములు పైకి రాళ్లు రువ్వుతూ రోడ్డుపై అటూ ఇటూ పరుగులు తీశాడు. అయినా ఆ కండక్టర్ ఆ నిందితుడిని వదిలి పెట్టలేదు. వెంబడించి మరీ పట్టుకున్నాడు. అలా పట్టుకోగానే ఆ దొంగ రోడ్డుపై పడిపోయి సొమ్మసిల్లినట్లు నాటకమాడాడు. దీంతో కండక్టర్, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతని వద్ద ఉన్న అరవింద్ చంద్ర మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని బాధితుడికి అందజేశారు.
చర్యలు తీసుకోని పోలీసులు : ఎంతో కష్టపడి దొంగను ఇతర సిబ్బంది సాయంతో పట్టుకున్న ఆర్టీసీ కండక్టర్, స్థానిక ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు అతడిని స్టేషన్‌కు తీసుకురాగానే మళ్లీ పడిపోయాడు. ఏం అడిగినా నోరు విప్పి వివరాలు చెప్పలేదు. ఎక్కువగా మద్యం తాగి ఉన్నాడు. దీంతో ఆ దొంగను పట్టించుకోకుండా పోలీసులు వదిలేశారు. తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది ఎంతో కష్టపడి పట్టుకుంటే, మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు వదిలేయడం పలు విమర్శలకు తావిస్తోంది.
పెరుగుతున్న చోరీలు : హైదరాబాద్ నగరంలో సెల్‌ఫోన్ దొంగతనాలు ఈ మధ్యలో భారీగా జరుగుతున్నాయి. వీటిపై ఫిర్యాదులు కూడా ఎక్కువ సంఖ్యలో పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్నాయి. పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఈ అంశంపై ఫోకస్ పెట్టినప్పటికీ క్షేత్రస్థాయిలో ఫలితాలు ఆశించినంతగా ఉండట్లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలా దొరికిన దొంగలను వదిలిపెట్టడంపై పోలీసుల వైఖరి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
తెల్లవారుజామునే హైదరాబాద్‌లో రెండు చోట్ల సెల్‌ఫోన్ చోరీ ఘటనలు - దర్యాప్తులో షాకింగ్ నిజాలు