Deputy CM Pawan Kalyan Press Meet on Vijayawada Floods: విపత్తు సమయంలో సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహార పదార్థాలు అందించామని సీఎం చంద్రబాబు అనుభవం ఏంటో ఈ విపత్తు సమయంలో చూస్తున్నామని కొనియాడారు. గతంలో హుద్‌హుద్ తుపాను సమయంలోనూ చంద్రబాబు ముందుచూపు చూశామని తెలిపారు.
వరద బాధితుల కోసం తన వంతుగా రూ.కోటి ప్రకటించానని త్వరలోనే సీఎంకు అందజేస్తానని తెలిపారు. ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా తేలిక కానీ పని చేసేవాళ్లకే ఎంత కష్టమో తెలుస్తుందని మండిపడ్డారు. పంచాయతీరాజ్ నుంచి జాయింట్ యాక్షన్ కమిటీ లక్షా 64 వేల మంది విరాళమిచ్చారని సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.14 కోట్లు అందజేస్తున్నారని తెలిపారు. విరాళమిచ్చిన ఉద్యోగులకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం నుంచి రూ.75 లక్షలు విరాళమిస్తున్నారని వివరించారు.
బుడమేరు పరివాహక ప్రాంతం దాదాపు 90 శాతం ఆక్రమణలో ఉందని పవన్ ఆరోపించారు. ఆక్రమణలే విజయవాడకు శాపంగా మార్చేశాయని అన్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించారని దీంతో విజయవాడ సగం నగరాన్ని వరద నీరు ముంచేసిందని అన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఆక్రమణలను హైడ్రా కూల్చేస్తోందని తెలిపారు. 20 ఏళ్లుగా వరదల్లేవు నీళ్లు లేవని చెరువును ఆక్రమించి కట్టేశారని అన్నారు. వాగులు, వంకలు వెళ్లే దిశలో నిర్మాణాలు కట్టేశారని ఇది ఒక్కరి పని కాదు కొన్ని దశాబ్దాలుగా ఆక్రమణలు కొనసాగాయని అన్నారు.
ఇలాంటి విపత్కర సమయంలో సీఎం చంద్రబాబు ఎలా పని చేస్తున్నారో చూస్తున్నామని పవన్ కల్యాణ్ కొనియాడారు. వెళ్లలేని ప్రదేశాల్లోకి కూడా పొక్లెయినర్లు, ట్రాక్టర్లు ఎక్కి చంద్రబాబు పర్యటిస్తున్నారని అలాంటిది సీఎంను అభినందించాల్సిన సమయంలో విమర్శలు మంచిది కాదని వైఎస్సార్సీపీకి చెబుతున్నానని అన్నారు. ఉమ్మడి సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత అందరిదని వైఎస్సార్సీపీని కోరుతున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.
నేను కనబడట్లేదని విమర్శలు చేస్తున్నారని నేను వస్తే సహాయ చర్యలకు ఆటంకమనే రావట్లేదని వివరించారు. ఇంకా విమర్శించాలనుకుంటే భవిష్యత్తులో నాతోపాటు రావచ్చని అన్నారు. విమర్శించే వాళ్లు ముందుగా వాళ్లు సాయం చేసి మాట్లాడాలని వైఎస్సార్సీపీ నాయకులు ఇళ్లలో కూర్చొని విమర్శలు చేయడం మంచిది కాదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
ఈ వరదల్లో దాదాపు 29 మంది చనిపోయారని మరో ఇద్దరు గల్లంతయ్యారని పవన్ కల్యాణ్ తెలిపారు. 200కు పైగా పశువులు మృత్యువాతపడ్డాయని 59,848 కోళ్లు, ఇతర జంతువులు చనిపోయాయని వివరించారు. 131 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాదాపు 60 మత్స్యకారుల పడవులు దెబ్బతిన్నాయని 3,312 కి.మీ. మేర రహదారులు ధ్వంసమయ్యాయని అన్నారు. లక్షా 69 వేల హెక్టార్లలో పంటనష్టం జరిగిందని 18,424 హెక్టార్లలో ఉద్యానవన పంట నష్టపోయిందని వివరించారు. సహాయచర్యల్లో 26 ఎన్డీఆర్‌ఎఫ్, 22 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు, నేవీ నుంచి 2 బృందాలు సహాయచర్యల్లో పాల్గొన్నాయని పవన్ కల్యాణ్ వివరించారు.
24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం - పలుచోట్ల భారీ వర్షాలు - Weather Update in AP