Pawan Kalyan on Volunteers: జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్లతో పని చేయించుకుని మోసం చేశారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. వాలంటీర్లను నియమించినట్లుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేని కారణంగా వారికి ఏమీ చేయలేకపోతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సర్పంచుల సంఘాల నేతలతో మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం అయ్యారు.
సర్పంచుల సంఘాలు లేవనెత్తిన సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని గ్రామ సర్పంచి పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌పై స్పందించారు. సచివాలయ సిబ్బందిని గ్రామ పంచాయతీ పరిధిలోకి తెచ్చేందుకు అభ్యంతరం లేదన్నారు. గ్రామాల స్వయం సమృద్ధి కోసం మొక్కల పెంపకాన్ని భారీ స్థాయిలో చేపడుతున్నట్లు వివరించారు. కలప ద్వారా వచ్చే ఆదాయంతో పంచాయతీలకు నిధుల కొరత లేకుండా చూస్తామన్నారు.
ఆయన సహకారంతోనే గ్రామాల అభివృద్ధి: సర్పంచుల కోసం అమరావతిలో రెండు ఎకరాల్లో కమ్యూనిటీ హాలు, శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ధిక సంఘం నిధులను నేరుగా పంచాయతీల ఖాతాకే జమ చేస్తున్న విషయం గుర్తు చేశారు. సర్పంచుల డిమాండ్లలో కీలకమైనవి గుర్తించి పూర్తిచేశామని తెలిపారు. కేరళ అధికారి కృష్ణతేజను డిప్యుటేషన్‌పై తీసుకొచ్చామన్న పవన్, ఆయన సహకారంతోనే గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని స్పష్టం చేశారు. నా పేషీలో ప్రజలకు మేలు చేద్దామన్న అధికారులు ఉండటం నా అదృష్టమని కొనియాడారు. ఎంపీ నిధుల ద్వారా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు పూర్తిచేస్తామని అన్నారు.
2014-19 పనులకు గత ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదన్న పవన్, గత ప్రభుత్వం పెండింగ్ నిధులు కూడా విడుదలకు కేబినెట్‌లో నిర్ణయించామని వెల్లడించారు. సర్పంచులకు ప్రథమ పౌరులు స్థానం ఇవ్వాలని, పంచాయతీలకు నిధులు ఎక్కువ కావాలని అన్నారు. స్వయం పోషక పంచాయతీలుగా ఎదగాలని తెలిపారు. 12 వేల 900 పంచాయతీల్లో నిధులను గత ప్రభుత్వం వాడేసుకుందని ఆరోపించారు. ఇతర అవసరాలకు రూ.8,629 కోట్లు మళ్లించేశారని, ఈ అంశాలను సీఎం, ఆర్ధికశాఖ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.
పంచాయతీలకు మరో 750 కోట్లు: మరో నెల రోజుల్లో రూ.750 కోట్లు పంచాయతీల ఖాతాలకే రాబోతున్నాయని, ప్రధాని కూడా గ్రామీణాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం బాధ్యత లేకుండా ఇష్టారాజ్యంగా చేసేసిందని, సరిచేయడానికి చంద్రబాబు అనుభవం కీలకంగా మారిందని కొనియాడారు. పంచాయతీల బలోపేతానికి చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నామని పవన్ అన్నారు.
గ్రామ వాలంటీర్ల అంశమే లేదు: గ్రామ వాలంటీర్లను జగన్ ప్రభుత్వం మోసం చేసి పెట్టుకుందని ఆరోపించారు. ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా గ్రామ వాలంటీర్ల అంశమే లేదని స్పష్టం చేశారు. అసలు ఉద్యోగాల్లోనే లేరంటే, రద్దు అనే అంశం ఎక్కడుందని ప్రశ్నించారు. జల్‌జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామంలో తాగునీరు అందిస్తామన్న పవన్, చెరువుల్లో పూడికలు తీసి నీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో అవినీతిని నిర్మూలించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
వాలంటీర్లను తీసేస్తామని మేము చెప్పలేదే : మంత్రి డోలా - Minister Dola on Volunteers