Deputy CM Pawan Kalyan Attend Gram Sabha: గ్రామపంచాయతీలు బలోపేతం అయితేనే రాష్ట్రం దేశం పురోగతి చెందుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సర్పంచుగా పని చేసే వ్యక్తి నిబద్ధతతో పని చేస్తే దేశానికి ఆదర్శంగా నిలవచ్చని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని నిధులు దారి మళ్లించి అభివృద్ధిని అటకెక్కించిందని మండిపడ్డారు. అన్నమ్యయ జిల్లా రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లెలో 'స్వర్ణ గ్రామపంచాయతీ' పేరిట నిర్వహించిన గ్రామ సభలో ఉపముఖ్యమంత్రి పాల్గొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం చర్యల్లో భాగంగా ప్రతీ ఏడాది 4 గ్రామసభలు నిర్వహిస్తామని వెల్లడించారు.
పంచాయతీలే దేశానికి పట్టుగొమ్మలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లెలో స్వర్ణ గ్రామపంచాయతీ గ్రామ సభలో ఉపముఖ్యమంత్రి పాల్గొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఏటా 4 గ్రామసభలు నిర్వహిస్తామని పవన్ చెప్పారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని నిధులు దారిమళ్లించి అభివృద్ధిని అటకెక్కించిందని మండిపడ్డారు. గ్రామ పంచాయతీలు బలపడితేనే రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలమని పవన్ తెలిపారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదన్న పవన్ అవసరమైతే గూండా యాక్టు తెస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల బలోపేతం కోసం రూ.998 కోట్లు విడుదల చేశామని పవన్ గుర్తు చేశారు. ఎక్కువ గ్రామాల్లో వైఎస్సార్సీపీ సర్పంచ్‌లు ఉన్నా రాజకీయాలకు అతీతంగా నిధులు ఇచ్చామన్నారు. గ్రామాలు స్వయం సమృద్ధిగా ఎదిగేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. మైసూరువారిపల్లె పంచాయతీకి 10 సెంట్ల స్థలం ఇచ్చిన రైతు కారుమంచి నారాయణను పవన్ ప్రత్యేకంగా అభినందించారు. ఆయన్ను ప్రశంసిస్తూ ఫొటో తీసుకున్నారు. ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రజల విశ్వాసం చూరగొన్న నాయకుడు పవన్ కల్యాణ్ అని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రశంసించారు. పవన్ నాయకత్వంలో గ్రామాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. గ్రామాలు పచ్చగా ఉంటే మనమంతా హాయిగా ఉంటాం. పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకొచ్చే వారిని నేను వదలుకోను. మనుషులను కలుపుకొనే వ్యక్తిని నేను విడగొట్టేవాణ్ని కాదు. గ్రామాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంలో గ్రామసభ చాలా ముఖ్యం. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్యలు చేపడుతున్నాం. 13,326 పంచాయతీలు బలపడితే రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలం.- పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం
అనకాపల్లి జిల్లాలో మరో 'ఫార్మా' ప్రమాదం - నలుగురు కార్మికులకు గాయాలు - Parawada Pharma City Incident