PAWAN KALYAN ON DUMPING YARDS ISSUE: వాటర్ గ్రిడ్ తరహాలోనే చెత్త సమస్య పరిష్కారం కోసం పది, పన్నెండు గ్రామాలకు కలిపి ఒక చెత్త డంపిగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. గ్రామాల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటుపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పవన్ సమాధానమిచ్చారు. చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలను సమర్థంగా నిర్వహించేలా ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు.
గ్రామాలను స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపిన ఆయన, అవకాశం ఉన్న గ్రామాల్లో డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చాలా గ్రామాల్లో డంపింగ్ యార్డులకు స్థలాలు లభ్యం కావడం లేదన్న పవన్ కల్యాణ్, దీని నివారణకు మల్టీ గ్రిడ్ వాటర్ స్కీం తరహాలో మండల హెడ్ క్వార్టర్స్‌లో డంపింగ్ యార్డులు పెట్టే యోచన చేస్తున్నట్లు తెలిపారు.
10-12 గ్రామాలకు కామన్‌గా డంపింగ్ యార్డు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో పూర్తి కార్యాచరణను ప్రకటిస్తామని శాసన మండలిలో సభ్యలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. గ్రామాల్లో పంచాయతీ ఆధ్వర్యంలో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు నిర్వహణకు 15వ ఫైనాన్స్ నుంచి నిధులు ఇచ్చినట్లు పవన్ తెలిపారు. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు సమర్థంగా నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు.
గ్రామాలు స్వచ్ఛంగా శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యతని, ఈ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 2019-24 లో గ్రామ సచివాలయాలకు రంగులు వేసేందుకే 101.81 కోట్లు ఖర్చు పెట్టారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 49.8 కోట్లు పెయింటింగ్‌లు వేసేందుకు, 52.73 కోట్లు పెయింట్లు తొలగించేందుకు ఖర్చు చేసినట్లు తెలిపారు. కేవలం పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని కార్యాలయాలకు మాత్రమే అయిన ఖర్చని, మిగిలిన కార్యాలయాలకు అయిన ఖర్చును సంబంధిత శాఖలు తెలియజేస్తాయన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పార్టీల రంగులను తొలగించి నిర్దేశిత రంగులను వేయడం జరిగిందన్నారు.
"గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణకు నిధులు ఇచ్చాం. 15వ ఫైనాన్స్ నిధులు సంపద సృష్టి కేంద్రాలకు కేటాయించాం. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు సమర్థంగా నిర్వహించేలా ఆదేశాలిచ్చాం. గ్రామాలు స్వచ్ఛంగా శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత.
డంపింగ్ యార్డుల సమస్యను కచ్చితంగా పరిష్కరిస్తాం". - పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం