Deputy CM Kottu Satyanarayana Fraud Case: ఉద్యోగం పేరిట ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మోసం చేశారని ఓ దళిత మహిళ ఆరోపించారు. 4 లక్షల 50వేల రూపాయలు తీసుకుని ముఖం చాటేశారని వాపోయారు. దీంతో ఉప ముఖ్యమంత్రిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం: పశ్చిమగోదావరి జిల్లా గణపవరం ప్రాంతానికి చెందిన ఓగిరాల పరిమళ సుమన అదే గ్రామంలోని పీహెచ్‌సీ-2లో స్టాఫ్‌నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం మిలటరీ మాధవరం గ్రామంలో లైన్‌మెన్‌గా పని చేస్తున్న ఎం. సుదర్శన్, అతడి భార్య సుగుణారాణి ఇద్దరూ మంత్రి ద్వారా ఆమె భర్త వీరవెంకట సత్యనారాయణకు తాడేపల్లిగూడెంలోని ఆసుపత్రిలో ఎమ్‌ఎన్‌ఓ (Male Nursing Orderly)గా ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారన్నారు.
మధ్య తరగతికి జగనన్న స్మార్ట్ మోసం - అమరావతిలో ప్లాట్లు కొన్నవారికి కష్టాలు - Amaravati Township
దీనికోసం మంత్రికి రూ.4.50 లక్షలు ఇవ్వాలని చెప్పినట్లు తెలిపారు. 2020 జనవరిలో మధ్యవర్తుల సహాయంతో నేరుగా అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రిని కలిసి డబ్బులు అందించామన్నారు. అయితే ఎమ్‌ఎన్‌ఓ ఉద్యోగం కాకుండా స్వీపర్ పోస్టు ఇచ్చి సంవత్సరం తర్వాత అది కూడా తొలగించారని చెప్పారు. ఈ విషయంపై మధ్యవర్తులను ప్రశ్నించగా తమపై దాడికి పాల్పడ్డారని బాధితురాలు వాపోయారు. ఈ నేపథ్యంలో తమ ప్రాణాలకు హాని ఉందని, తన భర్త కూడా ప్రాణ భయంతో ఎక్కడికో పారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను వివరణ కోరగా తాను ఎవరి వద్దా డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు.
"మిలటరీ మాధవరం గ్రామంలో లైన్‌మెన్‌గా పని చేస్తున్న ఎం.సుదర్శన్, అతడి భార్య సుగుణారాణి ఇద్దరూ మంత్రి ద్వారా నా భర్తకు తాడేపల్లి గూడెంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఎమ్‌ఎన్‌ఓగా ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. అందుకోసం మంత్రికి రూ.4.50 లక్షలు ఇవ్వాలని చెప్పారు. 2020 జనవరిలో మధ్యవర్తుల సహాయంతో నేరుగా అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రిని కలిసి డబ్బులు అందించాం. అయితే ఎమ్‌ఎన్‌ఓ ఉద్యోగం కాకుండా స్వీపర్ పోస్టు ఇచ్చి సంవత్సరం తర్వాత అది కూడా తొలగించారు. ఈ విషయంపై మధ్యవర్తులను ప్రశ్నించగా మాపై దాడికి పాల్పడ్డారు." - పరిమళ సుమన, బాధిత మహిళ