Bhatti Vikramarka At Lal Darwaja Simhavahini Mahankali Temple : హైదరాబాద్ పాతబస్తీలో లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి బోనాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి భారీగా తరలివస్తున్నారు. నెత్తిన బోనమెత్తి సల్లంగా సూడమ్మ అంటూ బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ బీజేపీ ఎంపీ లక్ష్మణ్, స్థానిక నేత మాధవీలత పాల్గొన్నారు.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలి బోనాల పండుగ జరుపుకుంటున్నామని భట్టి విక్రమార్క అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తుకుండా మౌలిక వసతుల కల్పించామని తెలిపారు. అందుకోసం ప్రభుత్వం 20 కోట్లను కేటాయించిందని గుర్తు చేశారు. హైదరాబాద్ ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం అమ్మవారి దర్శించుకున్నారు.
సింగపూర్‌లో ఘనంగా బోనాల జాతర - తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు - Bonalu Festival in Singapore
హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో జరిగే బోనాల వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు భట్టి వెల్లడించారు. గోల్కొండతో మొదలై, లష్కర్, ఈరోజు లాల్ దర్వాజ్ బోనాలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కొలుచుకొంటున్నామని చెప్పారు. శాంతి యుతంగా బోనాల జాతర నిర్వహించినట్లు పేర్కొన్నారు. సహకరించిన జంట నగర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. బోనాల పండుగ భూమి పుత్రుల పండుగ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరే పండుగ అని భట్టి అన్నారు.
లాల్ దర్వాజ్ మహంకాళి అమ్మవారు నగర ప్రజలను కాపాడుతున్నారని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పండుగకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని వసతులు సమకూర్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధి కోసం 10 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు వేసిందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో శాంతి భద్రత లకు ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు భట్టి విక్రమార్క వివరించారు.