Deputy CM Bhatti Vikramarka Announces Job Calendar : నిరుద్యోగ యువతీ యువకుల ఆశలు నెరవేర్చేందుకు ముందే చెప్పినట్లు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నట్లు వివరించారు. జాబ్ క్యాలెండర్ గురించి ముందే ప్రకటించినట్లు అమలు చేస్తామన్నారు.
గత ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీక్, పరీక్షలు వాయిదా పర్వాలతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేశామన్న భట్టి, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాల ప్రకటనలు రద్దు కావడం, వాయిదా వేయడం, ప్రశ్నా పత్రాల లీకేజీలు, పరీక్షల తేదీలు ఓవర్ లాప్ వంటి అనేక ఇబ్బందులు ఉద్యోగార్థులు పడ్డారని పేర్కొన్నారు.
"రాష్ట్రమంతా దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీయువకుల ఆశలను నిజం చేయటం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన హామీ మేరకు, మేము ప్రభుత్వంలోకి రాగానే నిరుద్యోగులకు బాసటగా ఉద్యోగాలను నియమించే ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాం. అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తాం. తద్వారా నిరుద్యోగ యువతీయువకులకు పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తేదీలతో సహా ముందుగానే క్యాలెండర్‌ను ప్రకటిస్తున్నాం."-మల్లు భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి
Telangana Job Calendar Update : గత ప్రభుత్వ పాలనలో గ్రూప్ - 1 పరీక్ష రెండు సార్లు రద్దైనట్లు గుర్తు చేశారు. 2023 మార్చి 17వ తేదీన పేపర్ లీక్, 2024 ఫిబ్రవరి 19న అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకపోవడంతో హైకోర్టు తీర్పు మూలంగా రద్దు అయ్యినట్లు వివరించారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసినట్లు పేర్కొన్న విక్రమార్క, యూపీఎస్సీ, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించినట్లు వివరించారు.
గ్రూప్ -1 నోటిఫికేషన్లో అదనంగా 60 పోస్టులు జోడించి 563 ఖాళీల కోసం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేశామని, ఫలితాలు ప్రకటించినట్లు పేర్కొన్నారు. గ్రూప్ -1, గ్రూప్ - 2, గ్రూప్- 3 పరీక్షల మధ్య తగిన సమయం లేకపోవడంతో నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబరుకు వాయిదా వేశామన్నారు. అక్టోబర్‌లో మరో గ్రూప్-1 నోటిఫికేషన్, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహిస్తామని వెల్లడించారు. అదే నెలలో ఏఈఈ సహా ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఉంటుందని, నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ వేస్తామని స్పష్టం చేశారు.
ఉద్యోగాన్వేషణలో తోడుగా - సరికొత్త AI టూల్స్ - ఎలా వాడాలంటే? - LinkedIn AI Tools