Dengue Cases in Telangana : తెలంగాణపై ఈ ఏడాది డెంగీ పంజా విసిరింది. రాష్ట్రవ్యాప్తంగా గత ఐదేళ్లతో పోలిస్తే ఈ సారి అధిక సంఖ్యలో కేసులు నమోదు అయినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కేంద్రం ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఈసారి సుమారు పది వేల మందికి పైగా డెంగీ బారిన పడ్డారు. అత్యధికంగా కర్ణాటకలో డెంగీ కేసులు నమోదు కాగా అత్యల్పంగా అరుణాచల్‌ప్రదేశ్ లో కేవలం 18 మంది మాత్రమే ఈ వ్యాధి బారినపడ్డారు. దేశవ్యాప్తంగా గత ఏడాదితో పోలిస్తే ఈ సారి దాదాపు లక్ష వరకు డెంగీ కేసులు తగ్గగా తెలంగాణలో మాత్రం బాధితుల సంఖ్య పెరగటం గమనార్హం.
భారీగా నమోదు : ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం, విపరీతమైన నీరసం, తలనొప్పి, కంటి వెనకభాగంలో నొప్పి, కీళ్ల నొప్పులు కనిపిస్తే అది డెంగీ ఏమో అని అనుమానించాలంటున్నారు వైద్యులు. సాధారణంగా ఏటా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు డెంగీ కేసులు దేశవ్యాప్తంగా ఎక్కువగా నమోదు అవుతుంటాయి. అయితే ఈసారి జులై, ఆగస్టు మాసాల్లోనే డెంగీ కేసులు భారీగా నమోదు కావటం గమనార్హం. తెలంగాణలో 2024 అక్టోబర్ చివరి నాటికి 9,761 మంది మహమ్మారి బారినపడినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం డెంగీ కేసులపై విడుదల చేసిన నివేదికలో గడచిన ఐదేళ్లతో పోలిస్తే ఈ సారి తెలంగాణలో కేసులు భారీగా నమోదైనట్టు తేలింది. కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సమయంలో రాష్ట్రంలో కేవలం 2100 మంది మాత్రమే డెంగీ బారిన పడగా గతేడాది ఆ సంఖ్య 8 వేలకు పెరిగింది. ఇక ఈ ఏడాది అత్యధికంగా 9,761 మంది అక్టోబర్ చివరి నాటికి డెంగీ బారినపడగా రాష్ట్రంలో ఎలాంటి మరణాలు నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
పట్టణాల్లోనే అధికంగా కేసులు : మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, మారుమూల పల్లెల్లో ఎక్కువగా కనిపించే డెంగీ ప్రభావం ఈ సారి పట్టణాల్లోనూ తీవ్రంగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఈ ఏడాది నమోదైన కేసుల్లో అత్యధిక భాగం హైదరాబాద్‌లోని నమోదు కావటం గమనార్హం. డెంగీ కేసులు పెరగటానికి వాతావరణంలో మార్పులు, అపరిశుభ్ర వాతావరణం ప్రధాన కారణాలంటున్నారు వైద్యులు.
తెలంగాణతో పోలిస్తే పొరుగునున్న ఏపీలో డెంగీ కేసుల సంఖ్య తగ్గటం గమనార్హం. ఈ ఏడాది ఏపీలో 4,790 డెంగీ కేసులు నమోదైనట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే దాదాపు 2వేల వరకు కేసులు తగ్గటం శుభపరిణామం. ఇక నేషనల్ సెంటర్ ఫర్ వెక్టార్ బార్న్ డిసీజెస్ కంట్రోల నివేదిక ప్రకారం దేశంలో గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి డెంగీ తీవ్రత తగ్గినట్టు స్ఫష్టమవుతోంది. దేశవ్యాప్తంగా ఈసారి మొత్తం లక్షా 86 వేల 567 కేసులు నమోదు కాగా 160 మంది మృతి చెందారు. గతేడాది సుమారు మూడున్నర లక్షల మంది మహమ్మారి బారినపడగా 485 మంది మృతి చెందినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే గతేడాదితో పోలిస్తే సుమారు లక్షకు పైగా కేసులు ఈ సారి తక్కువగా నమోదయ్యాయి.
అత్యధికంగా కర్ణాటకలో : ఇక ఈ ఏడాది అత్యధికంగా కర్ణాటకలో సుమారు 31 వేల మంది ఈ వ్యాధి బారినపడ్డారు. గత ఐదేళ్లలో కనీసం ఇందులో 50 శాతం మేర డెంగీ కేసులు నమోదు కాకపోవటం గమనార్హం. ఇక ఆ తర్వాత తమిళనాడులో 19 వేలు, కర్ణాటకలో 18వేల మందికి పైగా డెంగీ బారినపడినట్టు కేంద్ర ప్రభుత్వం స్ఫష్టం చేసింది. కర్ణాటకతో పోలిస్తే కేరళలో మరణాలు అత్యధికంగా ఉన్నట్టు స్ఫష్టమవుతోంది. 30 వేల కేసులు వచ్చిన కర్ణాటకలో 16 మంది మరణించగా కేరళలో 18 వేల కేసులు వెలుగు చూస్తే అందులో 71 మంది మరణించినట్టు గుర్తించారు.
దేశవ్యాప్తంగా డెంగీ ప్రభావం తగ్గినప్పటికీ తెలంగాణలో మాత్రం గతంతో పోలిస్తే అధిక సంఖ్యలో వైరస్ కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇక అధికారికంగా నమోదైన కేసులతో పోలిస్తే వెలుగు చూడని కేసులు మరిన్ని ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు పరిశుభ్రమైన వాతావరణాన్ని ఇంటి చుట్టుపక్కల ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
చికున్ గన్యా సోకిన వారిలో డెంగీ లక్షణాలు - అసలేం జరుగుతోంది?