Deceased Old Woman Family Members Angry on Jogi Ramesh: ప్రభుత్వ నిర్లక్ష్యానికి సామాజిక పింఛన్ దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సచివాలయాల వద్ద పింఛన్‌ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఈసీ సూచనల మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఫలితంగా పింఛన్ల కోసం వచ్చిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 9 గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉన్నా బ్యాంకు నుంచి ఇంకా సొమ్ము తమ చేతికి రాలేదని మధ్యాహ్నం రావాల్సిందిగా చాలామందిని సచివాలయ సిబ్బంది వెనక్కి పంపారు. మరికొన్నిచోట్ల గంటల తరబడి వేచిచూసేలా చేశారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో పింఛన్ కోసం వెళ్లి ఓ వృద్దురాలు మృతి చెందారు.
Protest Against Jogi Ramesh: జిల్లాలోని పెనమలూరు మండలం గంగూరులో పింఛన్ తీసుకునేందుకు వెళుతూ వడదెబ్బ తగిలి వజ్రమ్మ అనే వృద్ధురాలు మృతి చెందారు. పింఛన్ డబ్బుల కోసం రెండు మూడు సార్లు తిరగడంతో వజ్రమ్మ చనిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు జోగి రమేష్ అక్కడికి చేరుకోగా ఆయనకు నిరసన సెగ తగిలింది. బాధితురాలి మృతదేహంతో చంద్రబాబు నివాసానికి వెళదామని జోగి రమేష్ కుటుంబ సభ్యులతో అనగా చనిపోయిన బాధలో ఉంటే నీచ రాజకీయాలేంటి అంటూ జోగి రమేష్‌పై బంధువులు, స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓట్ల రాజకీయం కోసం వచ్చిన జోగి రమేష్ అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ బాధితురాలి బంధువుల ఆగ్రహం వెలిబుచ్చారు. ఇంటి మనిషి చనిపోయిన బాధలో ఉంటే రాజకీయం చేయటానికి వచ్చారా అంటూ మంత్రిపై బంధువులు అసహనం వ్వ్యక్తం చేశారు. మంత్రి జోగి రమేష్ శవ రాజకీయాలు చేస్తున్నాడని బాధితురాలి బంధువుల మండిపడ్డారు. బంధువుల ఆగ్రహంతో జోగి రమేష్, వైసీపీ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Argument between TDP and YCP Leaders: వజ్రమ్మ చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న తెలుగుదేశం, జనసేన నాయకులు అక్కడికి చేరుకుని బాధితు కుటుంబాన్ని పరామర్శించారు. అదే సమయంలో జోగి రమేష్, బోడె ప్రసాద్ అక్కడికి చేరుకున్నారు. ఫింఛన్ల విషయమై ఇరువురి నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఘటన స్థలానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం, వైసీపీ శ్రేణులు పోటాపోటీగా మోహరించారు. ఇంటి మనిషి చనిపోయిన బాధలో ఉంటే రాజకీయం చేయటానికి వచ్చారా అంటూ మంత్రి జోగి రమేష్‌పై అసహనం వ్యక్తం చేశారు. మంత్రి జోగి రమేష్ శవ రాజకీయాలు చేస్తున్నాడని టీడీపీ-జనసేన నేతలు మండిపడ్డారు. వజ్రమ్మ మృతికి సీఎం జగనే కారణమని మండిపడ్డారు.
Nara Lokesh on Jogi Ramesh: జోగి రమేశ్ వ్యవహారంపై నారా లోకేశ్ స్పందించారు. పింఛనర్ చనిపోతే చంద్రబాబు ఇంటికి తీసుకెళ్దామని జోగి రమేష్ నాటకాలాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలి బంధువులు మంత్రి జోగి రమేష్‌ను దూషించి పంపారని అన్నారు. వైసీపీ డీఎన్ఏలోనే శవ రాజకీయం ఉందని విమర్శించారు.