Dastagiri wife Shabana made serious allegations: తన భర్తకు ఎదైనా జరిగితే సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిదే బాధ్యత అని దస్తగిరి భార్య షబానా ఆరోపించారు. తన భర్త జైలు నుంచి బయటకు రాకుండా కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కడపజైల్లో దస్తగిరిని కలిసిన తర్వాత షబానా మీడియాతో మాట్లాడారు. వివేకా హత్యకేసులో అప్రువర్‌గా మారిన తరువాత వైఎస్సార్సీపీ నేతల నుంచి వేధింపులు పెరిగాయని షబానా వెల్లడించారు.
ఏ-3ని ఏ-1గా మార్చారు: తన భర్త జైలు నుంచి బయటికి వస్తే, పులివెందుల వైఎస్సార్సీపీ నాయకుల బండారం బయట పడుతుందనే ఉద్దేశంతోనే బెయిలు రాకుండా అడ్డుకుంటున్నారని దస్తగిరి భార్య షబానా ఆరోపించారు. వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి, యర్రగుంట్ల, వేముల పోలీసులు నమోదు చేసిన కేసుల్లో అరెస్టై వంద రోజులకు పైగానే కడపజైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఈ రెండు కేసుల్లో హైకోర్టు, కడప జిల్లా కోర్టు బెయిలు మంజూరు చేసినా, పోలీసులు సాంకేతిక పరమైన అంశాలు చూపించి బయటికి రాకుండా కుట్ర పన్నుతున్నారని షబానా ఆక్షేపించారు. మూడు రోజుల కిందట వేముల కేసులో ఏ-3గా ఉన్న దస్తగిరికి కడపజిల్లా కోర్టు బెయిలు మంజూరు చేసింది. జామీన్లు సిద్ధం చేసుకునే క్రమంలో పోలీసులు ఏ-3 కాదని ఏ-1 అని కోర్టుకు పత్రాలు సమర్పించి బెయిలు నుంచి విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని షబానా ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ షర్మిల అరెస్ట్ - మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలింపు
అవినాష్ రెడ్డి కనుసన్నల్లోనే కుట్ర: జైలులో తన భర్త దస్తగిరిని వైఎస్సార్సీపీ నాయకులు కలుస్తున్నారని షబానా ఆరోపించారు. వివేకా కేసులో తమకు అనుకూలంగా సాక్ష్యం చెబితే భారీగా నగదును ఇస్తామని దస్తగిరిని ప్రలోభ పెడుతున్నట్లు ఆమె మీడియా ముందు వాపోయారు. సీబీఐ ఎస్పీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని బెదిరిస్తున్నట్లు తన భర్త చెప్పారని షబానా పేర్కొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి కనుసన్నల్లోనే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. నా భర్త బయటికి వస్తే వారికెందుకు భయం అని ప్రశ్నించారు.
తన భర్తపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపిన జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజుకు, కర్నూలు అదనపు ఎస్పీగా పదోన్నతి ఇచ్చారని మండిపడ్డారు. తన కుటుంబానికి ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి బాధ్యత వహించాలని షబానా హెచ్చరించారు. కాగా, నేడు కడప జిల్లా ఎస్సీని కలిసిన వివేకానందరెడ్డి కుమార్తె సునీత దస్తగిరి అంశాన్ని సైతం ప్రస్తావించారు. దస్తగిరికి బెయిలు మంజూరైనప్పటికీ, అతన్ని బయటికి రాకుండా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తమకు తెలిసిందని సునీత ఎస్పీకి వివరించారు. సునీత రాజశేఖర్ రెడ్డి చెప్పిన అన్ని విషయాలను కూలంకశంగా విన్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.