Dasara Navaratri Celebrations 2024: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఒక చేతిలో మధురసాలతో కూడిన మాణిక్యపాత్ర, మరొక చేతిలో అన్నాన్ని అనుగ్రహించే రతనాల గరిటె ధరించి అన్నపూర్ణాదేవిగా బెజవాడ దుర్గమ్మ ఈరోజు భక్తులకు దర్శనమిచ్చారు. షడ్రుచులతో కూడిన భక్ష్యభోజ్యాదులు ఈ తల్లి అనుగ్రహం ద్వారానే మానవాళికి అందుతున్నాయనే విశ్వాసంతో అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లలో వెళ్లి జగన్మాతను కొలుస్తున్నారు.
శనివారం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆలయానికి వచ్చారు. ఈ సందర్బంగా భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై మంత్రి సమీక్షించారు. శనివారం రాత్రి ఆలయానికి వచ్చిన ఆయన భక్తులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులందరికీ అమ్మవారి దర్శనం బాగా జరుగుతుందా లేదా అని క్యూలైన్లలో నిలబడి పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులు తమకు కల్పిస్తున్న సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
తమకు గతంలో కంటే మరింత మెరుగ్గా అమ్మవారి దర్శనం లభిస్తోందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. వసతులు కూడా వసతులు కూడా మెరుగ్గా ఉన్నాయని మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలోనే ఉత్సవాలు నిర్వహిస్తున్న తీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ప్రతిరోజు మూడు నాలుగు సార్లు భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని, వారు సూచించిన ప్రకారం అదనపు సదుపాయాలు కల్పనకు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేయాలని పదేపదే సూచిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా అధికారులకు గుర్తు చేశారు. ఆ దిశలోనే ఉత్సవాలు జరిగే మిగిలిన రోజుల్లో మంచినీళ్లతో పాటు పాలు, మజ్జిగ కూడా పంపిణీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అమ్మవారి దర్శనానికి ముందు కృష్ణా నదికి ప్రతి నిత్యం ఇస్తున్న నవ హారతుల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ హారతుల్లో భక్తులు మరింత ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ, ఆలయ ఈవో కె. ఎస్. రామారావు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు సహా పలువురు ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. గతంకన్నా ఈసారి ఏర్పాట్లు బాగున్నాయని రఘురామ ప్రశంసించారు. జిల్లా కలెక్టర్, విజయవాడ పోలీస్ కమిషనర్ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
మార్మోగుతున్న ఆలయాలు - తిరుమలలో బ్రహ్మోత్సవాలు - శ్రీశైలం, ఇంద్రకీలాద్రిలో నవరాత్రోత్సవాలు
లలితా త్రిపుర సుందరిగా దుర్గమ్మ- ఆ రంగు చామంతులతో పూజిస్తే ఎంతో మంచిది!