Daggubati Purandeswari Comments: భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఏర్పాటు చారిత్రక ఘట్టం మాత్రమే కాక రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా ఎంతో అవసరం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కూటమి రాష్ట్రంలో, కేంద్రంలోనూ అధికారంలోకి రావాలని తెలిపారు. రాష్ట్ర సచివాలయాన్ని కూడా తనఖా పెట్టిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనపై ఉందని పురందేశ్వరి స్పష్టం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన నరసాపురం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. సమావేశంలో పురందేశ్వరితో పాటు రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ సిద్ధార్థ్‌నాథ్ సింగ్, పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ, తణుకు మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముళ్లపూడి రేణుక తదితరులు పాల్గొన్నారు.
మూడు పార్టీల జెండాలు వేరైనా అజెండా మాత్రం ఒకటేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పరిపాలనను, విద్వేష పూరిత, విధ్వంసకర, అవినీతి పరిపాలనను, మహిళలకు రక్షణ కల్పించలేని వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడమే లక్ష్యమని అన్నారు. ప్రజలు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని పార్టీని ఇంటికి పంపించేందుకు ఎదురుచూస్తున్నారని చెప్పారు.
విశాఖ డ్రగ్స్ కేసులో తమ కుటుంబానికి సంబంధం లేదని పురందేశ్వరి తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ నాలుగో తేదీన మూడు పార్టీలతో కూడిన పార్లమెంటు స్థాయి సమన్వయ కమిటీ సమావేశాలు, ఎనిమిదో తేదీన అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతాయన్నారు.
కేంద్ర స్థాయిలో సుపరిపాలన అందించడానికి, అవినీతి రహిత పరిపాలన కొనసాగించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజలు కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయోధ్య రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 అంశం వంటి వాటితో పాటు దేశంలో పేద ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా మోదీ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాయని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణం, ఉచిత బియ్యం పంపిణీ వంటి పథకాలు ప్రజలకు ఎంతగానో మేలు చేస్తున్నాయని వివరించారు. భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత తిరిగి అభ్యర్థులను మార్చే అవకాశం లేదని దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు.
"జెండాలు వేరు అయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధే మా లక్ష్యం. వైసీపీ పాలనకు చరమగీతం పాడాలి. విధ్వంసకర పాలన నుంచి ప్రజలను విముక్తి చేయాలి. అప్పుల ఊబిలోకి నెట్టేసిన వైసీపీకి ప్రజలే గుణపాఠం చెబుతారు". - దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు
వైఎస్సార్సీపీ నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసేందుకు ప్రతి కార్యకర్త పోరాడాలి : పురందేశ్వరి