Cyber Fraud Based on Bank Account : బ్యాంకు ఖాతా అప్పగిస్తే నెల వారీ కమీషన్ వస్తుందని ఆశ పడుతున్నారు. దళారుల ఆటలో పావులుగా మారి కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇలాంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలో నమోదు అయ్యింది. ముషీరాబాద్‌కు చెందిన అలీబేగ్ బావ అస్లాం సూచనతో తన బ్యాంకు ఖాతా లావాదేవీలను అతనికి అప్పగించాడు. తన పేరిట లక్షల రూపాయల్లో లావాదేవీ జరుగుతున్నట్టు గ్రహించలేకపోయాడు. సైబర్ మోసాల్లో బాధితులు జమ చేసిన నగదు ఈ ఖాతాలోకి చేరుతున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ధారించి అలీబేగ్‌ను అరెస్ట్ చేశారు. తనకేం తెలియదని బావపై నమ్మకంతో ఇలా చేశానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తరహాలో అస్లాం 11 బ్యాంకు అకౌంట్లను సేకరించి విదేశాలకు పంపినట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది.
దుబాయ్ నుంచి చక్రం తిప్పుతున్న ఫరీదుద్దీన్‌ను పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేసినట్టు సమాచారం. ఇతడు ఒక్కడే కాదు. హైదరాబాద్ నగరంలో వందలాది మంది ఏజెంట్లుగా మారి సైబర్ కేటుగాళ్లకు సహకరిస్తున్నారు. దుబాయ్ కేంద్రంగా సాగుతున్న అక్రమాలపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు.
వీడియో కాల్ వస్తే అలా చేయండి - ఫ్రంట్ కెమెరా మూసిన తర్వాతే లిఫ్ట్ చేయండి
చుట్టమని నమ్మితే చుక్కలే : దుబాయ్, సింగపూర్, మలేసియాల్లో స్థిరపడిన వారితో సోషల్ మీడియా ద్వారా పరిచయమై చుట్టాలు, మిత్రులకు అదనపు ఆదాయ మార్గం చూపుతామంటారు. వారితో బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్ ప్రారంభిస్తున్నారు. ఆ తర్వాత పాస్ పుస్తకం, సిమ్‌కార్డు తదితర సమాచారం దుబాయ్‌లోని మధ్యవర్తులకు చేరవేస్తున్నారు. వీరు చైనాలోని సూత్రధారులకు పంపుతున్నట్లు సమాచారం. అసలు నేరస్థులు ఈ సిమ్ కార్డులను ఫెడెక్స్, పెట్టుబడులు, షేర్ మార్కెట్ లాంటి సైబర్ మోసాలకు ఉపయోగిస్తున్నారు.
మీకూ ఇలాంటి కాల్ వచ్చిందా? - ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం!
అటు ఇటు మార్చి : సైబర్ నేరగాళ్లు చిరువ్యాపారులు, నిరుద్యోగులు, పాత నేరస్థులను బ్యాంకు ఖాతాలకు ఉపయోగించుకుంటున్నారు. వాటిల్లో నకిలీ సంస్థల పేరిట కరెంట్ ఖాతా ప్రారంభిస్తారు. ఖాతాదారులకు నెల వారీగా రూ.5 వేల నుంచి రూ. 10 వేలు, కొందరికి నగదు లావాదేవీలపై 10% కమీషన్ ఇస్తున్నారు. దళారులు మాత్రం 25% నుంచి 30% సొమ్ము తీసుకుంటున్నారు. బాధితుల ఖాతాల్లో జమైన నగదును యూపీఐ(UPI) ద్వారా వేర్వేరు ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. అనంతరం ఏజెంట్లు ద్వారా ఆ నగదును మనీట్రాన్స్‌ఫర్ ఏజెన్సీల ద్వారా దుబాయ్‌కు పంపుతున్నారు. అక్కడ నగదు క్రిప్టోగా (Crypto) మారి చైనాకు చేరుతోంది.
"ఆ స్టాక్‌లో కళ్లు చెదిరే లాభాలు" - ఏడు బ్యాంకు ఖాతాలకు రూ.1.21 కోట్లు - ఏమైందంటే!