Cyber Crimes Through Mule Bank Accounts: కమీషన్ పేరుతో పేద ప్రజలకు ఎర వేస్తారు. బోగస్ కంపెనీ పేర్లతో కరెంట్ బ్యాంక్ ఖాతాలు తెరుస్తారు. సైబర్ క్రైమ్స్‌లో దోచిన సొత్తును ఆ ఖాతాకు బదిలీ చేస్తున్నారు. గంటలో 200 బ్యాంక్ ఖాతాలకు చిన్న మొత్తాల్లో మళ్లించి, వేరే దేశాల్లో నగదు విత్ డ్రా చేస్తున్నారు. ఇలా సైబర్ క్రైమ్స్‌లో మ్యూల్ అకౌంట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో డబ్బు కోసం ఖాతాలను తెరిచిన వారే చిక్కడంతో కేసులు ముందుకు కదలడం లేదు. వందల కోట్ల రూపాయలు తరలిస్తున్న మ్యూల్ ఖాతాలు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి.
బ్యాంకులో కరెంట్ అకౌంట్లు తెరుస్తారు: మ్యూల్ అకౌంట్స్ ఇప్పుడు సైబర్ నేరాల చేధనలో పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. పేదలకు కమిషన్ ఎరవేసి అక్రమార్కులు బ్యాంక్ ఖాతాలు తెరుస్తున్నారు. 25 వేల నుంచి 50 వేల రూపాయల వరకు కమీషన్ ఇస్తానని ఆశ చూపిస్తున్నారు. వారి పేరు, అడ్రస్, ఫోటో పేరుతో నకిలీ కంపెనీని సృష్టించి ఆ వివరాలతో బ్యాంకులో కరెంట్ ఖాతాలను తెరుస్తున్నారు. ఖాతాదారుడికి తెలియకుండా అతని ఫోన్‌లో ఏపీకే ఫైల్ పంపించి ఓటీపీలు నేరస్థులకు వచ్చే విధంగా సెట్ చేస్తున్నారు. ఇలా ప్రధాన ఖాతాలుగా కొన్నింటిని పెట్టుకుంటున్నారు.
ప్రణాళిక ప్రకారం మ్యూల్ అకౌంట్ల పర్యవేక్షణ: ఒక్కో ప్రధాన ఖాతాకు మరికొన్ని బ్యాంకు ఖాతాలను జత చేస్తున్నారు. సైబర్ నేరస్థులు దోచిన సొమ్ము ముందుగా ప్రధాన ఖాతాలోకి వెళ్తుంది. ఆ తర్వాత నిమిషాల్లోనే ఆ ఖాతాకు అనుసంధానించిన ఇతర అకౌంట్లలోకి చిన్న మొత్తాల్లో పంపిస్తారు. చిన్నమొత్తాలుగా విడిపోయిన నగదు మళ్లీ దుబాయ్, హాంకాంగ్‌లో ఉన్న కీలక నిందితుల అకౌంట్లలోకి వెళతాయి. అక్కడ నగదు విత్‌డ్రా చేస్తున్నారు. ఇదంతా గంట నుంచి గంటన్నర లోపే జరిగిపోతుంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, దిల్లీ, గుజరాత్ రాష్ట్రాలను సైబర్ నేరస్థులు అడ్డాలు ఏర్పాటు చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. ఓ ప్రణాళిక ప్రకారం మ్యూల్ అకౌంట్ల పర్యవేక్షణ జరుగుతోందని, వ్యవస్థీకృతంగా సైబర్ నేరాలు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
అనంతపురంలో అడ్డంగా బుక్కైన SBI మేనేజర్ - దిల్లీ వెళ్లినా నో యూజ్
నేరం ఏదైనా నగదు తరలించే మార్గం ఒకటే: డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్, బిట్ కాయిన్, లోన్ యాప్ ఇలా నేరం ఏదైనా నగదు తరలించే మార్గం ఒకటే. బోగస్ కంపెనీలతో కరెంట్ ఖాతాలు తెరవటం నగదు తరలించటం సైబర్ నేరగాళ్ల మోడెస్ ఆపరెండీ అని విజయవాడ సైబర్ క్రైమ్ డీసీపీ తిరుమలేశ్వర్ రెడ్డి చెప్పారు. వీటన్నింటికీ మూలం మ్యూల్ ఖాతాలని తెలిపారు.
కరెంట్ ఖాతాలను తెరిచేటప్పుడు జాగ్రత్త: అధిక మొత్తంలో నగదు తరలించేందుకు కరెంట్ అకౌంట్‌ను నేరస్థులు ఎంచుకుంటున్నారు. కరెంట్ ఖాతాలో రెండు లక్షల రూపాయల వరకు ఒకేసారి జమ చేసుకోవచ్చు. ఒక్కో కంపెనీకి ఒక్కోరకమైన పరిమితి ఉంటుంది. సాధారణంగా కరెంట్ ఖాతాలను తెరిచేటప్పుడు బ్యాంక్ సిబ్బంది కంపెనీ అడ్రస్‌లో ఉందా? లేదా ? అని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించాలి. కానీ ఇవేమి చేయకుండానే బ్యాంక్ సిబ్బంది ఖాతాలను తెరవటంతో బోగస్ ఖాతాలు విస్తృతంగా పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.
పోలీసులకు సవాల్: ఈ తరహా నేరాలలో నిందితులను పట్టుకోవటం సవాల్‌గా మారింది. ఖాతాల్లో ఉన్న వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తే కేవలం కమిషన్ కోసం ఖాతాలను అమ్ముకున్న వ్యక్తులు మాత్రమే పోలీసులకు చిక్కుతున్నారు. దర్యాప్తు అక్కడ నుంచి ముందుకు సాగటం లేదు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి ఆ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయించే లోపు వాటిలో జమ అయిన నగదు దేశం దాటి పోతుంది. దుబాయ్, హాంకాంగ్ లాంటి దేశాలతో భారత్‌కు ఒప్పందాలు లేనందున అక్కడి నుంచి నిందితులను తీసుకురావడం, నగదు తిరిగి రప్పించడం కష్టమవుతుంది.
ప్రశ్నించండి: మ్యూల్ ఖాతాలను అరికట్టి సైబర్ నేరాలు నియంత్రించేందుకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి కరెంటు ఖాతాల్లో 2 లక్షలు, అంతకంటే ఎక్కువ జమ చేస్తే ప్రశ్నించాలని సూచిస్తున్నారు.